విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
హుస్నాబాద్ :
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ :
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సాయుధ పోరాటవీరుల అమరత్వాన్ని చిన్నచూపు చూస్తున్నారని, ప్రజల ఆకాంక్షను గౌరవించని ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో సాయుధపోరాట వీరుల స్తూపం వద్ద శనివారం నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు వెనకంజ వేస్తోందని అన్నారు. బంగారు తెలంగాణ కాదని, ప్రజలకు బతుకుదెరువు చూపించే తెలంగాణ కావాలని సూచించారు. సాగునీరు, తాగునీరు, ఇళ్లు, ఉపాధి లభించేలా చూడాలన్నారు. తెలంగాణకోసం త్యాగం చేసిన పోరాటవీరుల గుర్తుగా హైదరాబాద్‌లో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. త్యాగధనులను విస్మరించవద్దని అన్నారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చాలని, వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.నారాయణ, రచయిత అల్లం రాజయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్‌కుమార్, గంభీరపు రామయ్య, పెండెల అయిలయ్య, జాగీరు సత్యనారాయణ, గడిపె మల్లేశ్, సర్పంచ్‌లు పిట్టల సంపత్, గంభీరపు మధుసూదన్, ఎంపీటీసీ కుంట మల్లయ్య పాల్గొన్నారు.
బైక్ నడిపిన చాడ
తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాల్లో భాగం గా హుస్నాబాద్‌లో జరిగిన కార్యక్రమాలకు హాజరైన సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బైక్ నడిపారు. హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ గుట్టల వరకు ఆయన బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.