సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా పార్టీ నేతలకు నామినేటెడ్ పదవీ యోగం దక్కట్లేదు. లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ఆశిస్తూ వచ్చిన నేతలకు నెలల తరబడి ఎదురుచూపులు తప్పట్లేదు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నేతలతో పాటు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్లు, వేర్వేరు పార్టీల నుంచి చేరిన నేతలు నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. మంత్రి మండలిని మూడుసార్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విస్తరించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్లకు త్వరలో కీలక పదవులు అప్పగిస్తామని సంకేతాలిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కడియంకు రాజ్యసభ, నాయినికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవులు దక్కుతాయనే ప్రచారం జరిగింది. మంత్రి మండలి విస్తరణ జరిగి నాలుగు నెలలు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపై స్పష్టత రాలేదు.
కొద్దిమందికే అవకాశం
రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. కరీంనగర్ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒకరిద్దరు నేతలకు కేబినెట్ ర్యాంకుతో పదవులు దక్కాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ, మండలి చైర్మన్‌గా అవకాశం కల్పించగా, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌కు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. సుమారు 12 మంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్లు, సలహాదారులుగా పదవీ కాలం పొడిగించారు. రాష్ట్రంలో సుమారు 90 ప్రభుత్వ కార్పొరేషన్లు ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి మెజారిటీ కార్పొరేషన్లలో పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ముగిసింది.
దీంతో తమ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ కొందరు, కొత్తగా తమకు అవకాశం కల్పించాలంటూ మరికొందరు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 29 ప్రధాన కార్పొరేషన్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కు అవకాశం కల్పించేందుకు ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫి ట్’ నిబంధన అడ్డుగా ఉందనే కారణంగా ఇటీ వల ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదిలా ఉంటే క్షేత్ర స్థాయిలో మార్కెట్, దేవాలయ పాలక మండళ్లు కూడా చాలా చోట్ల ఖాళీగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నేతలు తమకు అవకాశం కల్పించాలంటూ కోరుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాతేనా!
జనవరి మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా నాటికే జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సంస్థాగత కమిటీల నిర్మాణం వంటి సంస్థాగత అంశాలు పెండింగు పడుతూ వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలు తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్‌లు, అసెంబ్లీ కమిటీల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించడం ద్వారా నామినేటెడ్ పదవులు ఆశించవద్దనే సందేశాన్ని కొందరు సీనియర్ నేతలకు సీఎం పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment