హైదరాబాద్ సిటీ (ముషీరాబాద్): బీసీ ఉద్యోగులందరికీ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వచ్చే కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా బీసీలందరి సంక్షేమం కోసం రూ.50 కోట్లు కేటాయించాలని ఆయన కోరారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన బీసీ టీచర్స్ యూనియన్ ఉద్యోగుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... కేంద్రలోని గత ప్రభుత్వాలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కల్యాణ లక్ష్మీ పథకాన్ని బీసీ వర్గాలకు కూడా వర్తింపజేయాలని, చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో 14 లక్షలు, తెలంగాణలో 2 లక్షలు, ఆంధ్రలో లక్షన్నర ఉద్యోగాల్లో ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.