కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పలు రహదారులు, ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పలు రహదారులు, ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ.. జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జంట కమిషనరేట్లలోని ఫ్లై ఓవర్లను నేటి రాత్రి మూసివేస్తారు. ఆంక్షలు బుధవారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు అమలులో ఉంటాయని వారు తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలనుంచి జంట కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 200కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్లతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజర్లకు పోలీసులు ప్రత్యేక సూచనలు చేశారు. ఈవెంట్ జరిగే ప్రాంతాల్లో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వేడుకలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని నిబంధనలు పెట్టారు. ఈ సమయాల్లో ఈవెంట్ ఆర్గనైజర్లు విధిగా ప్రత్యేక ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. ఈవెంట్ సందర్భంగా పరిమితిని మించి టికెట్లు విక్రయించరాదని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.