'ఒంటిగంట తర్వాత పట్టుబడితే కఠిన చర్యలు'
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం మీడియాతో మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఔటర్ రింగ్రోడ్డుపై నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. సైబరాబాద్లో 7వేల మంది పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు.
వేడుకలు జరిగే చోట తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరిమితికి మించి టికెట్లు అమ్మరాదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలని, ఈవెంట్స్కు పోలీసులు ఆటంకం కలిగించరని ఆయన చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతిస్తామన్నారు.
ఒంటిగంట తర్వాత 100 పోలీసు బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఔటర్ రింగ్రోడ్డు, పీపీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్లు మూసివేయనుట్లు చెప్పారు. గతంలో పట్టుబడ్డ 25మంది ఫామ్హౌస్ మేనేజర్లకు 131 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు.