బాటిల్ మూత ప్రాణం తీసింది
గొంతులో ఇరుక్కొని బాలుడి మృతి
ఏడాదిన్నర బాలుడి గొంతులో వాటర్ బాటిల్ మూత ఇరుక్కోవడంతో మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కండ్లపల్లిలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని జహంగీర్, రిజ్వానాబేగం దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు పుట్టి ప్రసవ సమయంలోనే కన్నుమూశారు. అనంతరం ఎన్నో ఏళ్ల ప్రార్థనల తర్వాత వారికి పిల్లలు సమీరా(4), తబ్రేజ్ పుట్టారు.
బుధవారం ఉదయం ఇంట్లో కుటుంబీకులంతా పనుల్లో నిమగ్నమయ్యారు. తబ్రేజ్ వాటర్ బాటిల్‌తో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో దాని మూత ఊడిపోగా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఇంతలోనే ఆ మూత గొంతులో ఇరుక్కుపోయింది. బాలుడి రోదనలతో తల్లిదండ్రులు వచ్చిచూడగా.. గొంతులో ఏదో తట్టుకుందని గమనించిన జహంగీర్ బాలుడి నోట్లో వేళ్లు పెట్టగా బాటిల్ మూత ఉంది. ఎంత ప్రయత్నించినా మూత బయటకు రాకపోవడంతో బాలుడిని తలకిందులుగా చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలోనే తబ్రేజ్ ఊపిరి ఆగిపోయింది.