రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా మరో ఇద్దరు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశాలు జారీచేశారు.
అయితే సోమవారమే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్నందున శాసన సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు న్యాయమూర్తిని అభ్యర్థించారు.
దీనికి స్పందించిన న్యాయమూర్తి లక్ష్మీపతి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రేవంత్ రెడ్డికి అనుమతినిచ్చారు. దీంతో రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి.. మిగతా ఇద్దరు నిందితులను నేరుగా చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం రేవంత్ ను కూడా చర్లపల్లి జైలుకు తరలిస్తారు.
సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి నివాసానికి రేవంత్ను తీసుకొచ్చిన అధికారులు సంబంధిత పత్రాలతో సహా ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందుంచారు. ఎఫ్ఐఆర్ లో మొత్తం నలుగురు నిందితుల్ని చేర్చిన ఏసీబీ.. రేవంత్ రెడ్డిని ఏ1గా, సెబాస్టియన్ను ఏ2గా పేర్కొన్నారు. ఏ3గా ఉదయ్ని, ఏ4గా మ్యాథ్యూస్ను చేర్చారు.