'ఆ విధంగా' ముందుకు వెళ్లారు..
(వెబ్ సైట్ ప్రత్యేకం)
నగరంలోని ప్రసిద్ధ ఏవీ కాలేజీ నుంచి బీఏ పట్టా పొందిన రేవంత్ రెడ్డికి గెలుపు, నేరాలకు మధ్య తేడా తెలియకుండా ఉంటుందా? కచ్చితంగా తెలుసు. కాకుంటే అందరు నిందితులకు లాగానే 'నేను పట్టుబడే అవకాశమే లేదు' అనుకొని ఉంటాడు. అంతటి ఆత్మవిశ్వాసం ఆయనకు ఉంది కూడా. ఇక్కడ మనం ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
సూపర్ హిట్ అయి, వారానికి రెండుసార్లు టీవీలో ప్రసారమయ్యే ఓ తెలుగు సినిమాలో సీబీఐ అధికారి మరో పాత్రధారితో ఇలా అంటాడు.. 'ఫలానా వాడు చస్తే నువ్వు సీఎం అవుతావ్. కానీ ఫలానా వాణ్ని చంపితే నువ్వు నేరస్తుడివి అవుతావ్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్' అని. ఆ సినిమాను, అంతకంటే లోతుగా టీవీల్లో చూపించే క్రైమ్ రిపోర్టులను చూసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యేని కొనడానికి ఏకంగా డబ్బు సంచులతో వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఆ పనిని ఏ ధైర్యంతో చేశాడు? ముందు చూపుతో చేశాడా? ఆ విధంగా ముందుకు వెళ్లాలనుకున్నాడా!
ముందు చూపుంటే రాజకీయాల్లో ఎదుగుదల ఉన్న కోరికతో రగిలిపోతూ.. పెద్ద సారును మరింత ప్రసన్నం చేసుకునే క్రమంలో ఆ విధంగా రేవంత్ 'దూకుడు'గా వెళ్లాడేమో. అయితే చరిత్ర సబ్జెక్ట్తో డిగ్రీ సాధించిన రేవంత్.. తన యజమాని చరిత్రను చదవడంలో, వాటిలో తనలాంటి ఎందరో పావులకు సంబంధించిన అధ్యాయాలను గుర్తుచేసుకునే పరిస్థితిలో లేరు. యువ ఎమ్మెల్యే కదా. దూకుడుతో పాటు దుందుడుకు తనమూ ఎక్కువే. ఇదేమీ యువ ప్రేమికుల మధ్య తెలిసో తెలియకో రాయబారాలు నడిపే పిల్లాడి కథకాదు. పూర్తి స్పృహలో ఒక ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం. శిక్షార్హమైన నేరం.
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో చర్చల్లో (ఆదివారం రాత్రి నుంచి టీవీల్లో ప్రసారమవుతోన్న వీడియోల ఆధారంగా) రేవంత్ అనేక హామీలు గుప్పించారు. అవసరమైతే ఏపీ సంస్థానంలో ఓ రాచపదవి ఇప్పిస్తానని, కేంద్ర ప్రభుత్వం అండదండలు తమకున్నాయని చెప్పారు. తెలుగు తక్కువగా తెలిసి, తెలుగు ఛానెళ్లు తక్కువగా చూసే స్టీవెన్ సన్కు (నిన్నటి వీడియోలోనూ ఆయన ఇంగ్లీష్ న్యూస్ ఛానెలే చూస్తున్నారు) జాతీయ స్థాయిలో టీడీపీ ప్రభావం ఎంతుందో తెలియజెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.
ఇక పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలోనైతే ఆయన పూర్తిగా తేలిపోయారు. అప్పటికే ప్రశ్నలద్వారా ఆయన చెవులను, జవాబుల కోసం మైకులతో మూతిని చుట్టేసిన విలేకరులను చూసి కొద్దిగా తడబడ్డారు. 'నేను చేసింది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అయితే నచ్చాల్సిన వారికి నచ్చితే చాలు' అని తన నెత్తిమీద కుండను తానే బద్దలు కొట్టుకునిమరీ బరువు దించుకునే ప్రయత్నం చేశారు. వీడియోలు ఉన్నాయని తెలియక మీసాలు దువ్వారు. ఒంటికాలి మీద లేశారు. దించేస్తాం.. దంచేస్తాం లాంటి అశ్శరభ అవతారం కూడా ఎత్తారు.
ఇక రాత్రి ఏసీబీ హెడ్ క్వార్టర్స్లోనైతే ఏడ్చేశారు కూడా. ఇదంతా 'కేసీఆర్ కుట్ర.. కేసీఆర్ను గద్దెదించుతా' తప్ప మరో మాట మాట్లాడలేని పరిస్థితి ఆయనది. త్వరలో పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని కానున్నానని, కుల బలంతో హవా కొనసాగించగలలనీ ఆయన అన్నారు. ఇక్కడ సమస్యేమిటంటే అలాంటి 'హామీలు' పొందినవారు ఆయన పార్టీలో చాలా మంది ఉండటం. ఆ రేసులో తానెక్కడ వెనుకబడిపోతానోనన్న భయం తద్వారా పూనిన స్వామి భక్తి.. రేవంత్ను క్షణంలో రవ్వంత మనిషిని చేసింది.
ఒకవేళ రేవంత్ ఈ పనికి పూనుకోకుంటే ఏం జరిగిఉండేది? ఏదో ఒకనాటికి కాలం కలిసి రాకపోయేదా..! రాజకీయ విందులో కూర్చున్నవాడు తన వంతు వచ్చేవరకు (అవసరమైతే చాలా ఏళ్ల వరకు) వేచి ఉండక తప్పదు. తొందరపడితే.. ఇదిగో ఇలా అనివార్యంగా వరుసలో నిల్చొని టైమ్ ప్రకారం భోంచేయాల్సి వస్తుంది. రేప్పొద్దున రేవంత్కు బెయిల్ దొరకొచ్చు. అప్పటికే ఆయన కోరుకున్న పదవుల్లో వేరేవాళ్లు ఉండనూవచ్చు. ఎందుకంటే వంద రేవంత్ రెడ్డిలను తయారు చేయగల సత్తా ఆ యజమానికి ఉంది.
ఇంత హడావుడిలోనూ ఒక ఆశ్యర్యకరమైన దృశ్యం చాలా మంది దృష్టిని ఆకర్షించి ఉంటుంది. ఐదు కోట్ల బేరామాడి 50 లక్షల నోట్ల కట్టల్ని అందంగా పేర్చిన రేవంతుడి చేతిలో ఎలాంటి మొబైల్ ఫోన్ ఉండాలి? కనీసం యాభై వేల ఖరీదైనా ఉండొద్దా..! కానీ పాపం డబ్బులు లేని రేవంత్ (ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకారం రేవంత్ దగ్గర డబ్బులు లేవట పాపం) కనీసం వెయ్యి రూపాయలు కూడా ఖరీదు చేయని పాతకాలం ఫోన్.. ఆప్తులకు వెనకేసిన ఆస్తుల లాగే ఫోన్లు కూడా బినామీనే. ఆ నంబర్ ఏమిటో, ఎవరి పేరుమీద ఉందో.. దొరకకుండా ఎత్తుల్లో ఇదీ ఒక ఎత్తుడగేమో.
'కార్యకర్తలు, నాయకులు మాకు ప్రధానం. మాది పారదర్శక ప్రభుత్వం.. మాది విలువలున్న పార్టీ..' నిన్నగాక మొన్న టీవీలనిండా మారుమోగిన గొంతు.. విలువలున్న పార్టీ వలువలన్నీ టీవీల స్క్రీన్లపై నిన్న సాయంత్రం నుంచి ఒక్కొక్కటిగా జారిపోతుంటే.. దబాయించే గొంతు కనబడదు. వినబడదు. ఆ విధంగా ముందుకు వెళ్లిపోయినట్టుంది. నిజమే రాజకీయాల్లో హత్యలు ఎంతో ఆత్మహత్యల సంఖ్యా అంతే. ఆత్మకు శాంతి చేకూరుగాక.
మధు