
రేవంత్‌కు షరతులతో బెయిల్
* ఉదయసింహ, సెబాస్టియన్‌లకు కూడా..
* ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహలకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ తన నియోజకవర్గం కొడంగల్ దాటి బయటకు రాకూడదని, ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులు స్వాధీనం చేయడంతోపాటు రూ.5లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడంతో.. రేవంత్, సహ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం మరోసారి విచారించారు.
దర్యాప్తునకు విఘాతం..
తొలుత ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉందని, ఆడియో, వీడియో రికార్డుల ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా అందాల్సి ఉందని వివరించారు. అంతేకాక రూ.4.50 కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందని.. ఈ కేసులో నాల్గో నిందితుడు మత్తయ్య పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. ‘ఓటుకు కోట్లు’ తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తోసిపుచ్చారు.
రేవంత్ తదితరులకు బెయిలివ్వడం వల్ల ఏసీ బీ దర్యాప్తునకు ఆటంకం కలగబోదని భావిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ తదితరులను పోలీ సులు ఇప్పటికే విచారించినందున ఇంకా రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. బెయిల్ నిరాకరిం చేందుకు ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉండటం ప్రాతిపదిక కాదని.. ఈ కేసులో కీలక సాక్షులను ఇప్పటికే విచారించి, వాంగ్మూలాలను నమోదు చేశారని చెప్పారు.
ఇక మత్తయ్యను పరారీదారుడిగా పేర్కొనాల్సిన అవసరం లేదని, అతను ఇప్పటికే కేసు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం, అతని అరెస్ట్‌పై స్టే విధించడం జరిగిందని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.4.5 కోట్లు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందన్న కారణంతో బెయిల్ నిరాకరించలేమన్నారు. ఇవి గరిష్టంగా ఐదేళ్లు, కనిష్టంగా ఆరు నెలల శిక్షపడే అవకాశమున్న కేసులని.. బెయిల్ మంజూరు చేయదగినవేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇప్పటికే నింది తులు 25 రోజులకుపైగా జైల్లో ఉన్నారు కాబట్టి బెయిల్ పొందేందుకు అర్హులేనంటూ.. పలు షరతులతో బెయిల్ మంజూరు చేశారు.
బెయిల్‌కు షరతులు..
* ముగ్గురు నిందితులు కూడా తలా రూ.5 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలి.
* తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు రేవంత్ కొడంగల్ నియోజకవర్గం దాటి బయటకు రాకూడదు.
* దర్యాప్తు అధికారులు ఎప్పుడు కోరితే అప్పుడు రేవంత్ వారి ముందు హాజరు కావాలి.
* సెబాస్టియన్, ఉదయసింహ ప్రతీ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి.
* ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులను కింది కోర్టుకు అప్పగించాలి.