సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొడంగల్ గడ్డపై కాలుమోపడంతో ఈ గడ్డ పుణితమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నలభైఏళ్ల క్రితం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇక్కడ ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చాయని, ఇప్పుడు రాహుల్ పర్యటనతో ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కొడంగల్ అంటే ఎవరికీ తెలియదని.. ఇప్పుడు కొడంగల్ పేరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా చేశానని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం పోరాడుతుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై 40 కేసులు పెట్టిందని ఆరోపించారు. తనకు ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌పై పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని.. దానికి మీరంతా సహకరించాలని రేవంత్ కోరారు.
రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ..
కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు భృతి, లక్ష ఉద్యోగాల హామీలను నెరవేరుస్తామని ఉత్తమ్ ప్రకటించారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, నిరుద్యోగులను మోసం చేశారని ఉత్తమ్ విమర్శించారు.
గొంగళి పురుగునైనా హత్తుకుంటానన్నాడు..
కృష్ణ నది నీటికోసం కలలు కన్నామని.. జూరాల నుంచి నారాయణ పేట, కొడంగల్‌కు సాగునీరు వస్తుందని ఆశపడ్డామని కానీ అవేవీ జరగలేదని టీజేఎసీ ఛైర్మన్ కొదండరాం అన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నిండడం తప్ప రైతుల భూములకు నీళ్లు రాలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు కమీషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహాకూటమిపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ గతంలో తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా హత్తుకుంటానన్న కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము కలిసినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment