ఆర్‌ఎంపీ కుటుంబం ఆత్మహత్య
♦ ఆర్థిక ఇబ్బందులు తాళలేక అఘాయిత్యం
♦ భార్యాభర్తలు, కుమార్తె మృతి
నవాబుపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి కుటుంబం గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి భార్యాభర్తలతోపాటు కుమార్తె మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన సామల లక్ష్మీనారాయణ(50) స్థానికంగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. తల్లిదండ్రుల వద్ద చిన్న కుమార్తె సుప్రజ ఉంటోంది. కొన్ని రోజులుగా లక్ష్మీనారాయణ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణ తన భార్య అలివేలు(45), కుమార్తె సుప్రజ(23)లతో కలసి బుధవారం రాత్రి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరం దేవాలయానికి వెళ్లి అక్కడ జాగారం చేశారు.
గురువారం తెల్లవారుజామున నవాబ్‌పేటకు బయలుదేరారు. గ్రామ సమీపంలో పొలం వద్దకు వచ్చి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామస్తులు సుప్రజను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. రామేశ్వరం వెళ్లొస్తానని చెప్పిన కొడుకు శాశ్వతంగా దేవుడు దగ్గరికి వెళ్లాడంటూ ఆయన తల్లి రంగమ్మ గుండెల విసేలా రోదించింది. కాగా, లక్ష్మీనారాయణ టీఆర్‌ఎస్ నవాబుపేట పట్టణ మాజీ అధ్యక్షుడు. బాధిత కుటుంబాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు.