రహదారిపై కందకం తవ్విన మావోలు
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో విలీనం చేసుకున్న ముంపు మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి- పేగ గ్రామాల మధ్య రహదారిపై రెండు అడుగులకు పైగా కందకాలు తవ్వడం కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ కందకాలు తవ్వినట్లు భావిస్తున్నారు. కందకాలు తవ్విన ప్రదేశానికి సమీపంలోనే ఓ చెట్టుకు మావోయిస్టులు పోస్టర్ అంటించి వెళ్లారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక దినంగా జరుపుకోవాలని ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఉద్యమంలో అసువులు బాసిన మహిళా సభ్యులకు నివాళులు అర్పించాలని కూడా అందులో పేర్కొన్నారు. సమీపంలో రోడ్డుపై కరపత్రాలను విడిచివెళ్లారు. రెండు చోట్ల రహదారిపై చెట్లను నరికి వేశారు. రెండు అడుగుల లోతులో కందకం తవ్వేందుకు సుమారు మూడు గంటల సమయం పడుతుందని భావిస్తుండగా, మావోయిస్టులు పెద్ద ఎత్తున వచ్చి కందకాలు తవ్వి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మావోయిస్టులు తవ్విన కందకంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం తరువాత రోడ్డు పక్క నుంచి దారి వేసి వాహనాలను పంపించారు.