సాక్షి, హైదరాబాద్: సోమవారం వచ్చిందంటే చాలు ఏ మూలన ఏ బ్యాంకు దొంగతనం వ్యవహారం వెలుగులోకి వస్తుందా అని చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం పోలీసు విభాగంలో నెలకొంది. బ్యాంకుల్లో ఉన్న లోపాలకు తోడు.. దొంగలు అనుసరిస్తున్న పంథానే దీనికి కారణం. తీరిగ్గా తమ పని పూర్తి చేసుకోవడంతోపాటు విషయం బయటకు పొక్కేలోపే సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం కోసం దొంగలు ‘టార్గెట్ శనివారం’ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన మూడు బ్యాంకు దొంగతనాలు సోమవారం బయటపడ్డాయి. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెంలో ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకును శనివారం రాత్రి దొంగలు కొల్లగొట్టారు.
అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఆజాంనగర్ ఏపీజీవీబీ బ్యాంకుల్లోనూ దొంగతనాలు జరిగాయి. అలాగే ఈ ఏడాది జనవరిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్, ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని గ్రామీణ వికాశ్ బ్యాంకుల్లో జరిగిన భారీ చోరీలు శనివారమే చోటు చేసుకున్నాయి. ఇవే కాకుండా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ యత్నాలు కూడా శనివారమే జరిగి సోమవారం వెలుగులోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లకు చెందిన అనేక ముఠాలు బ్యాంకులు, భారీ ఫైనాన్స్ సంస్థల్నే టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నాయని ఇప్పటికే నిర్ధారణైంది.
ఏదైనా నేరం జరిగిన తరవాత విషయం ఎంత త్వరగా పోలీసులకు తెలిస్తే.. దొంగల్ని పట్టుకోవడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే శనివారం చోరీ చేస్తే మరుసటి రోజు సెలవు కావడంతో బ్యాంకు సిబ్బంది సహా ఎవ్వరూ దాన్ని గుర్తించే అవకాశం ఉండదు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం వెలుగులోకి రాదు. ఇలా తమ చేతిలో ఉంటున్న 24 గంటలకు పైగా కాలాన్ని వినియోగించుకుంటున్న పొరుగు రాష్ట్రాల ముఠాలు క్షేమంగా తప్పించుకుంటున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పోలీ సు విభాగం బ్యాంకుల్ని అప్రమత్తం చేయాలని భావిస్తోంది. సెలవు దినాల్లో సైతం ఓ బాధ్యతగల ఉద్యోగి వచ్చి బ్యాంకును పరిశీలించి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది.