‘స్వగృహ’లో ఎస్కలేషన్ మాయ రూ.100 కోట్లపైనే?
ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది రూ.70 కోట్లు
ప్రభుత్వానికి నివేదించిన అధికారులు.. స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లో ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు అప్పనం గా చెల్లించిన రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొందరు నేతలు, అధికారులు కుమ్మక్కై స్వగృహకు వర్తించని జీఓను అడ్డుపెట్టుకుని ఈ చెల్లింపులు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ బాగోతం వెలుగు చూసింది. తొలుత దీంతో రూ.70 కోట్లు దారిమళ్లాయని గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రాథమికంగా తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. కానీ దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో అసలు గల్లంతైన మొత్తం ఎంతో పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చేపనిని పక్కనపెట్టేశారు.
‘ఉత్త’ర్వుతో హస్తలాఘవం..: నిర్మాణ సామగ్రి ధర పెరిగితే అదనపు చెల్లింపులకు అవకాశం ఉంటుంది. సిమెంట్, స్టీలుతోపాటు ఇసుక, ఇ టుక, విద్యుత్ ఉపకరణాలు, ఫ్లోరింగ్, శానిటరీ సామగ్రి, కూలీ రేట్లు... ఇలా అన్నిరకాల అంశాలకు సంబంధించి ధరల్లో పెరుగుదల నమోదైతే కాంట్రాక్టర్లకు అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా ఐదేళ్లక్రితం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అయితే ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంతో నిర్మాణాలు జరుపుతున్నందున దాన్ని స్వగృహకు వర్తింపచేయాల్సిన అవసరం లేదని అప్పట్లో నిర్ణయించారు. వెరసి ఆ ఉత్తర్వు స్వగృహకు వర్తించదని స్వగృహ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. కానీ ఎన్నికలు సమీపించేవేళ కొందరు ఉన్నతాధికారులు, నేతలు కలసి దాన్ని స్వగృహకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. అప్పటికే పూర్తయిన పనులకు కూ డా దాన్ని వర్తింపచేయటం విశేషం. ప్రభుత్వం అప్పట్లో స్వగృహకు రూ.240 కోట్ల రుణం అందజేసింది. అందులోంచి ఈ ఉత్తర్వు ప్రకారం కాం ట్రాక్టర్లకు అదనంగా చెల్లింపులు జరిపారు. ఆ తర్వాత మరికొన్ని నిధులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. వాటిల్లోంచి ఇలాగే చెల్లింపు లు జరిపినట్టు తెలిసింది. విభజన సమయంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఇలాంటి ఓ ప్రతి పాదన గవర్నర్‌కు చేరింది. దాన్ని ఆయన పెం డింగ్‌లో పెట్టి... విభజనానంతరం తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. ఆ ఫైలును పరిశీలించిన ప్రస్తుత అధికారులకు అసలు విషయం తెలిసి విచారణ జరపటంతో గుట్టురట్టయింది.