
సాక్షి, హైదరాబాద్ : 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కోసం రూ.2,042.5 కోట్లు అవసరమని సంక్షేమ శాఖలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఇందులో ఫీజు రీయింబర్స్ కోసం రూ.1,385.5 కోట్లు, ఉపకారవేతనాల కోసం రూ.657 కోట్లు అవసరమని అంచనా వేశాయి. ఈ మేరకు ప్రాథమిక ప్రతిపాద నలు రూపొందించిన అధికారులు.. ప్రభు త్వానికి నివేదించేందుకు సిద్ధ మవుతున్నారు. మరోవైపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దర ఖాస్తు గడువు మంగళవారంతో ముగియ నుంది. ఇప్పటికే రెండుసార్లు గడువును పెంచిన ప్రభుత్వం.. ఇకపై పొడిగింపు ఉండబోదని ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 తర్వాత ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా నమోదు ప్రక్రియను నిలిపేయనుంది.
దరఖాస్తు చేసు కుంది 93 శాతమే...
పోస్టుమెట్రిక్ విద్యార్థుల 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు ఈ ఏడాది జూలై రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. సెప్టెంబర్ 30తో దరఖాస్తుల స్వీకరణ ముగించాలని ప్రభుత్వం భావించింది. కానీ గడువు నాటికి 40 శాతం దరఖాస్తులు కూడా రాకపోవడంతో గడువు తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించినప్పటికీ.. దరఖాస్తులు 55 శాతం దాటలేదు. దీంతో చివరి అవకాశంగా డిసెంబర్ 31 వరకు గడువును పొడిగించారు. ఈక్రమంలో సోమవారం నాటికి 12,06,518 దరఖాస్తులు వచ్చాయి. అదే గత వార్షిక సంవత్సరంలో 12,86,898 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 93 శాతం దరఖాస్తులు రాగా... మంగళవారం రాత్రి వరకు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
మరో అవకాశం ఇవ్వండి..
ఆర్టీసీ సమ్మె, రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్‌లతో చాలాచోట్ల విద్యార్థులు సకాలంలో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేకపోయారు. దీంతో కొందరు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదు. చివరి అవకాశంగా పక్షం రోజులు గడువును పెంచాలి. దీనిపై ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులకు సోమవారం వినతిపత్రం ఇచ్చాం. ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. –గౌర సతీశ్, ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం కన్వీనర్
గడువు పొడిగించలేం..
ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించాం. ఇకపై పొడిగించే అవకాశం లేదు. వెబ్‌సైట్ సాంకేతిక కారణాలతో దరఖాస్తు చేసుకోకుంటే (సంబంధిత ఆధారాలు సమర్పిస్తే) తప్ప అవ కాశమివ్వలేం. దరఖాస్తు గడువును పొడిగిస్తూ పోవడంతో బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్