జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావ్ చెప్పారు.
ఆమనగల్లు: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావ్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయవచ్చని ఆయన చెప్పారు. ఆమనగల్లు మండలం రాంనుంతల, ఆమనగల్లులో ఉన్న నర్సరీలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాంనుంతలలోని అయ్యసాగరం నర్సరీలో కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి నీటి సమస్యల పరిష్కారానికి రూ.5కోట్లతో ప్రతిపాదనలు పంపించామని.. రెండుమూడు రోజుల్లో నిధులు మంజూరు కావచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో నూతనంగా బోర్ల డ్రిల్లింగ్ చేపట్టకుండా అవసరమైన బోర్లను లీజుకు తీసుకుని నీటిని సరఫరా చేస్తామని ఆయన వివరించారు.
గతంలో బోర్ల లీజు, నీటి ట్యాంకర్ల సరఫరాకు సంబంధించిన బకాయిలు రూ.9 కోట్లు ఉన్నాయని వాటిని ఈ నెలాఖరు లోగా చెల్లిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో 51 అటవీశాఖ, 16 ఎన్‌ఆర్‌ఈజీఎస్ వననర్సరీలు ఉన్నాయని ఈ నర్సరీలలో 2.37 కోట్ల మొక్కలను హరితహారం కోసం పెంచుతున్నామని కలెక్టర్ వివరించారు. వీటితో పాటు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పదిలక్షల మొక్కలు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలను నాటుతామని ఆయన తెలిపారు.
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో రూ.5.36కోట్ల బకాయిలు కూలీలకు చెల్లించాల్సి ఉందని.. వీలైనంత త్వరలో బకాయిలు చెల్లిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో 34వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని.. మరికొన్ని రోజుల్లో 50వేల మంది కూలీలు పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి వినోద్‌కుమార్, ఎఫ్‌డీఓ జానకిరాం, ఆమనగల్లు మండల ప్రత్యేకాధికారి, జేడీఏ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కందుకూరు ఆర్డీఓ నర్సింహారెడ్డి, తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ వెంకట్రాములు, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ కమాలుద్దీన్ తదితరులున్నారు.
అటవీశాఖ అధికారుల తీరుపై అసంతృప్తి
అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీరుపై జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో అయ్యసాగరం నర్సరీ, చంద్రాయణపల్లితండా నర్సరీలలో మొక్కలు ఎండిపోవడం పట్ల కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. నీటి ఇబ్బందులు ఉంటాయని తెలిసినప్పటికి పెద్ద మొత్తంలో మొక్కలు ఎందుకు పెంచారని ఆయన ప్రశ్నించారు. దీనికితోడు రికార్డుల నమోదు కూడా సరిగా లేకపోవడంతో అటవీశాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.