వారెవ్వా.. వాలెట్‌ | RTA M Vallet Alerts For Drunk And Drives And Traffic Rules | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. వాలెట్‌

Published Sat, May 12 2018 10:12 AM | Last Updated on Sat, May 12 2018 10:12 AM

RTA M Vallet Alerts For Drunk And Drives And Traffic Rules - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా..రోడ్డు భద్రత నిబంధనలను బేఖాతరు చేశారా...తస్మాత్‌ జాగ్రత్త.  ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులే కాదు. మీ మొబైల్‌ ఫోన్‌ కూడా  మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీకు తెలియకుండానే ఉల్లంఘించే నిబంధనలపైన పోలీసులు నమోదు చేసే కేసులు ఎప్పటికప్పుడు  మీ మొబైల్‌కు చేరిపోతాయి. డ్రంకన్‌ డ్రైవ్, ఇతర ఉల్లంఘనల్లో  మీ వాహనంపైన  రవాణాశాఖ నమోదు చేసే ‘పెనాలిటీ  పాయింట్స్‌’  ఎప్పటికప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవచ్చు. రోడ్డు నిబంధనలపై పదే పదే  తప్పులు చేయకుండా  వాహనదారులను నిరంతరం అప్రమత్తం చేసేందుకు రూపొందించిన ‘ఆర్టీఏ –ఎం వాలెట్‌’  మొబైల్‌ యాప్‌ను రవాణాశాఖ మరింత ఆధునీకరించింది. అన్ని రకాల పౌరసేవలను ఒక్క యాప్‌తో  పొందే సదుపాయాన్ని కల్పించింది.

రెండేళ్ల క్రితం  ప్రవేశపెట్టిన  ఈ  అప్లికేషన్‌కు  వాహనదారుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోంది. 20.38 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం  ట్రాఫిక్‌  ఈ చలానాలను  ఆర్టీఏ – ఎం వాలెట్‌ నుంచి పొందడంతో  పాటు ఆన్‌లైన్‌లో  చలానాలు చెల్లించే  సదుపాయాన్ని ప్రవేశపెట్టిన అధికారులు తాజాగా ‘పెనాల్టీ పాయింట్స్‌’ కూడా తెలుసుకొనే అవకాశం కల్పించారు. వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సు మనుగడలో  ఉన్నదీ లేనిదీ కూడా  చెప్పేస్తుంది. పోలీసులు, ఆర్టీఏ అధికారులు నమోదు చేసే కేసులను  తప్పించుకునే అవకాశం లేకుండా  ‘ఆర్టీఏ –ఎం వాలెట్‌’ ఒక హెచ్చరికలా పని చేస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఒక్కసారి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు  మీ బండి జాతకం మొత్తం తెలిసిపోతుంది. మీకు బండి నడిపే అర్హత  మీకు ఉందో లేదో చెప్పేస్తుంది.

అరచేతిలో సమస్తం
మొదట్లో  డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ డేటాను  వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తూ  రవాణాశాఖ 2016 మార్చి 30న  ‘ఆర్టీఏ–ఎం వాలెట్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. కొద్ది రోజులకే లక్షలాది మంది వాహనదారులు ఈ యాప్‌ను ద్వారా తమ డాక్యుమెంట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం   20, 38000 మంది  ఆర్టీఏ ఎం వాలెట్‌ సేవలను వినియోగించకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాప్‌ను మరింత సేవలకు విస్తరించేందుకు  రవాణాశాఖ చర్యలు చేపట్టింది.
ట్రాఫిక్‌ చలానాల నమోదు వివరాలతో పాటు  ఆన్‌లైన్‌ చెల్లింపులకు అవకాశం కల్పించారు.  
‘వాహనం ఇన్సూరెన్స్‌’ స్టేటస్‌ను కూడా  తెలుసుకోవచ్చు.
ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై  నమోదయ్యే పెనాల్టీ పాయింట్స్‌ ఆప్షన్‌ను కూడా  ప్రవేశపెట్టారు.  
లెర్నింగ్‌ లెసెన్సులు, పర్మనెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల కొత్త రిజిస్ట్రేషన్‌ల కోసం, డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌  కోసం ఆర్టీఏ ఎం వాలెట్‌ నుంచి నేరుగా స్లాట్‌ నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా  ఫీజులు చెల్లించవచ్చు.  
వరుసగా 12 పాయింట్‌లు నమోదైనప్పుడు, లేదా ఇతర కారణాల వల్ల  ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసినా ఆ వివరాలు  ఈ యాప్‌లో కనిపిస్తాయి. డ్రైవింగ్‌ లైసెన్సు స్టేటస్‌  తెలిసిపోతుంది.
టీ యాప్‌ ఫొలియోతో అనుసంధానం
ప్రస్తుతం ప్రభుత్వం  అన్ని రకాల పౌరసేవలను  ఒకే యాప్‌ ద్వారా అందజేసేందుకు  ప్రవేశపెట్టిన  ‘ టి యాప్‌ ఫొలియో (ఎఫ్‌ఓఎల్‌ఏఓ) తో  ఆర్టీఏ ఎం వాలెట్‌ను అనుసంధానం చేశారు. ఈ యాప్‌ ద్వారా కూడా  ఆర్టీఏ సేవలను పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement