పోలీస్ ఎస్కార్ట్‌తో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇందుకోసం ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకోవడంతో ఏకంగా పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో వాటిని నడుపుతున్నారు.
గురవారం వరంగల్ జిల్లాలో పోలీసుల ఎస్కార్ట్ సహాయంతో నడుస్తున్న బస్సులపై నర్సంపేట సమీపంలో ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు. రెండు బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు దాడులకు పాల్పడిన ముగ్గురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.