తొర్రూరు ఆస్పత్రిలో అశోక్‌ను పరామర్శిస్తున్న అధికారులు
సాక్షి, తొర్రూరు(వరంగల్) : ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ఘటన మరువకముందే తొర్రూరు మండలంలోని సోమారంలో గురువారం ఓ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మేకల లక్ష్మీనారాయణ అనే ఆర్టీసీ డ్రైవర్ 2004 సంవత్సరంలో అనారోగ్యంతో విధుల్లో ఉండి మృతి చెందాడు. ఈక్రమంలో వారసత్వంగా గత రెండేళ్ల క్రితం తొర్రూరు ఆర్టీసీ డిపోలో తన కుమారుడు మేకల అశోక్ (30) శ్రామిక్‌గా విధుల్లో చేరాడు. ఇప్పటికే చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నక్రమంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు.
కార్మికుల సమస్యల పరిష్కరం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం, విధులు లేక, రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అసలు తమ సమస్యలు పరిష్కరం అవుతాయో లేదేమోనాని ఆందోళన చెందిన అశోక్ మనస్థాపంతో ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి, తన కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తికి ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు అశోక్ ఇంటి వద్దకు వెళ్లి చూసి, వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో తొర్రూరులోని సాయిమల్టీ స్పెషలిటీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అశోక్‌కు భార్య స్రవంతి, కుమారుడు లక్ష్మిపతి, కుమారై లక్ష్మిప్రసన్న ఉన్నారు.
అధికారుల పరామర్శ..
ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు మేకల అశోక్‌ను తొర్రూరు ఆర్డీఓ ఈశ్వరయ్య, డీఎస్పీ మదన్‌లాల్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరాం,, డిప్యూటి డీఎంహెచ్‌ఓ డాక్టర్ కోటచలం, తహసీల్దార్ రమేష్‌బాబు, సీఐ చేరాలు, ఎస్సై నాగేష్, ఆర్‌ఐ భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సర్పంచ్‌లు సంపత్, రవీందర్‌రెడ్డి, వామ పక్ష పార్టీల నాయకులు వెంకటయ్య, కొత్తపెల్లి రవి, బొల్లం అశోక్, ముంజంపెల్లి వీరన్న, తమ్మెర విశేశ్వర్‌రావు, గట్టు శ్రీమన్నారాయణ, ఆర్టీసీ నాయకులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment