మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. బుధవారం కార్మిక శాఖతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మే 6 నుంచి నిరవధికంగా సమ్మె చేయాలని ఏపీ, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న 1.20 లక్షల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ నెల 2న ఈయూ-టీఎంయూ నేతలు సమ్మె నోటీసిచ్చారు. దీనిపై రెండు సార్లు యాజమాన్యంతో, కార్మిక శాఖ అధికారులతో చర్చలు జరిగాయి. ఇవి విఫలం కావడంతో యూనియన్ నేతలు సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఈయూ-టీఎంయూ నేతలు కె.పద్మాకర్, అశ్వత్థామరెడ్డిలు మీడియాకు తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు 2013 ఏప్రిల్ 1 నుంచి వేతనాల సవరణ జరగాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2014 ఫిబ్రవరి 1 నుంచి 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ నిరవధిక సమ్మెకు ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు మద్దతివ్వాలని ఈయూ, టీఎంయూ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24 నుంచి అన్ని డిపోలు, వర్కు షాపుల వద్ద సమ్మె సన్నాహక యాత్రలు నిర్వహించి కార్మికులను సమ్మెకు సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఆంధ్ర ఎన్‌ఎంయూ నేతలు ఎన్నికలు జరపాలన్న డిమాండ్ విరమించుకుని సమ్మెకు మద్దతు పలకాలని కోరారు.