హైదరాబాద్‌ః ఆర్టీసీ పరిస్థితిని అర్ధం చేసుకుని యూనియన్ నేతలు సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎండీ సాంబశివరావు కోరారు. సోమవారం బస్‌భవన్‌లో యూనియన్ నేతల సమ్మె నిర్ణయంపై ఎండీ సాంబశివరావు యూనియన్ నేతలతో చర్చించారు. ఇందుకు యూనియన్ నేతలు స్పందిస్తూ ఆర్టీసీ పరిస్థితిని అర్ధం చేసుకున్నందునే సమ్మెకు ఇంత గడువు ఇచ్చామని, ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్ల కాలం దాటుతుందని, ఖచ్చితంగా ఫిట్‌మెంటు ప్రకటించాలని యూనియన్ నేతలు కోరినట్లు తెలిసింది.
రెండు రాష్ట్రాల సీఎంలతో తాను చర్చిస్తానని ఎండీ సాంబశివరావు యూనియన్ నేతలకు తెలిపారు. సమ్మె సన్నాహక యాత్రల్లో యూనియన్ నేతలు మే 6 నుంచి జరగనున్న నిరవధిక సమ్మెకు ఆర్టీసీ కార్మికులను సమాయత్తం చేసేందుకు ఏపీలో ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె సన్నాహక యాత్రలు చేపట్టింది. సోమవారం తిరుపతిలో యూనియన్ నేతలు పాల్గొని మే 6 నుంచి తిరుమల కొండపైకి వెళ్లే బస్సులు నిలిచిపోతాయని ప్రకటించారు.