
వదంతుల కలకలం
- జాగరణ చేసిన జనం
- భయంతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు
సాక్షి నెట్‌వర్క్ : జిల్లాలో వదంతులు కలకలం సృష్టించాయి. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడిందని... దీంతో అనర్ధం జరుగుతుందని... పిల్లలను పడుకోనివ్వవద్దని... లేకుంటే భూకంపం వస్తుందనే ప్రచారం దావనలంలా వ్యాపించింది. సెల్‌ఫోన్ సౌకర్యంతో ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామం, తండాలకు.. ఇలా జిల్లావ్యాప్తంగా పుకార్లు షికారు చేశాయి. దీంతో బుధవారం అర్ధరాత్రి ప్రజలు కంటిమీద కునుకులేకుండా తెల్లవార్లూ జాగరణ చేశారు. భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
డోర్నకల్‌లో మహిళలు బొడ్రాయి వద్దకు చేరి తెల్లవారే వరకు కోలాటం ఆడారు. మెయిన్‌రోడ్‌లో అర్ధరాత్రి హోటళ్లు, పాన్‌షాప్‌లు తెరుచుకున్నాయి. కురవి మండల కేంద్రంలోని గుడి పరిసర ప్రాంతాల్లో శిశువు పుట్టిందని ప్రచారం జరగడంతో తులిస్యా, లింగ్యా, లచ్చిరాం, రేకులతండా, రాంచంద్రాపురంలల్లో జనం బజార్‌లకు వచ్చి గుమిగూడారు. చెంచులు డప్పులతో ఊరేగింపుగా వస్తుంటే కురవి ఎస్సై భీమేష్ వారిని చెల్లాచెదురు చేశారు.
గుడిలో మైక్ వేసిన అనంతరం కల్లాపు చల్లారు. మరిపెడ, నర్సింహులపేట, మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, కొత్తగూడ, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, కమలాపురం, గోవిందరావుపేట, నల్లబెల్లి, నర్సంపేట, రఘునాథపల్లి, రాయపర్తి, ఆత్మకూరు, సంగెం, ములుగు, హసన్‌పర్తి, వర్ధన్నపేట తదితర మండలాలతోపాటు నగరంలోనూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు భయంభయంగా గడిపారు.
మూఢనమ్మకాలను విశ్వసించొద్దు
పాప పుట్టగానే మాట్లాడుతుందని, గేదెకు ఓ మూడు తలల ఆడ శిశువు జన్మించిందని, ఇద్దరు కవలలు పుట్టారని... వీరు పుట్టగానే రాత్రి వేళ పడుకుంటే భూకంపం వచ్చి చనిపోతారని హెచ్చరించినట్లు వస్తున్నవన్నీ మూఢనమ్మకాలే. వీటిని ఎవరూ నమ్మొద్దు. కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడలపై రాసేవారు. గత ఏడాది హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి ప్రాంతంలో ఏడు అడుగుల వ్యక్తి తిరుగుతున్నాడంటూ పుకారు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇవన్నీ వట్టి పుకార్లే అని తర్వాత తేలింది.
ఈ తరహా ప్రచారాలకు ఇప్పటివరకు శాస్త్రీయ అధారాలు లభించలేదు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉండే ఇలాంటి వందతులను నమ్మెద్దు. సమాజంలో ఉన్న కొందరు స్వార్థపూరిత శక్తులు ఇలాంటి వదంతులను ప్రచారంలోకి తెస్తాయి. ప్రజలు వీటిని నమ్మి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు. గేదె కడుపున మానవ శిశువు జన్మించినట్లు ఎక్కడైనా జరిగితే మాకు చెప్పండి. మేము నిజనిర్ధారణ కమిటీ వేసి నిజాలేమిటో తేలుస్తాం.
-డాక్టర్ బి.జగదీశ్‌బాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు