నిరుద్యోగ యువత పరిశ్రమల స్థాపన, వ్యాపార కేం ద్రాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు అతీగతిలేదు.
- పీఎంఆర్‌వై.. పీఎంఈజీపీగా మార్పు
- పేరు మారినా.. తీరు మారలే
- నిరుద్యోగ యువతకుఅందని రుణం
- మూడేళ్లుగా పైసా విదిల్చని వైనం
- భరోసా ఇవ్వని జిల్లా పరిశ్రమలశాఖ
పాలమూరు: నిరుద్యోగ యువత పరిశ్రమల స్థాపన, వ్యాపార కేం ద్రాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు అతీగతిలేదు. దీం తో దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై)పథకం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు అందించారు. జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా లబ్ధిపొంది ఉన్నతస్థాయికి చేరిన యువకులు చాలామంది ఉన్నారు.
గత 15 ఏళ్లలో పరిశ్రమల స్థాపనకోసం జిల్లావ్యాప్తంగా దాదాపు 20వేల మం ది నిరుద్యోగులకు రుణ అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై), ఖాదీబోర్డు/ ఖాదీ కమిషన్‌కు చెందిన గ్రామీణ ఉ పాధికల్పన పథకం(ఆర్‌ఈజీపీ)లను మిళితం చేసి పీఎంఈజీపీగా పేరుమార్చారు. ఒకప్పుడు వేలమందికి అందే సబ్సిడీ రుణాలు ఇప్పుడు పదుల సం ఖ్యలోనే అందుతున్నాయి. పథకాన్ని పూర్తిస్థాయిలో మార్పుచేయడంతో ని రుపేద వర్గాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. మార్పుచేసిన ఈ పథకం ద్వారా ధనికవర్గాలకు చెందిన వారికే పరిశ్రమలశాఖ నుంచి సబ్సిడీ రుణం అందుతోంది. దీంతో ఆర్థికంగా స్థోమతలేని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది.
యువత ఆశలపై నీళ్లు!
పీఎంఈజీపీ ప్రవేశపెట్టిన తర్వాత గత మూడేళ్లుగా స్వయం ఉపాధి రుణాలు పేదలకు అందడం లేదు. దీనికితోడు 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి సంబంధించి సబ్సిడీ నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రభుత్వం నిధులిస్తుందో.. లేదోనన్న సందేహంతో పరిశ్రమల స్థాపనకోసం యువకులు ముందుకు రావడం లేదు. గతమెంతో వైభవంగా కొనసాగిన పీఎంఆర్‌వై పథకం (ప్రస్తుత పీఎం ఈజీపీ పథకం)ఇప్పుడు ఉనికి లేకుండా పోతోంది.
ఉపాధి కల్పన కోసం నిధులు వినియోగించడంలో ప్రభుత్వశాఖల వైఫల్యం కారణంగానే మూడేళ్లుగా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరుకావడం లేదని విమర్శలు ఉన్నాయి. రెండేళ్లుగా కొం దరు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ లు నిర్వహించినప్పటికీ రుణాలు మం జూరు చేయలేదు. కాగా, ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదని, దీంతో తాము మరోపనిపై దృష్టి సారించలేకపోతున్నామని దరఖాస్తుదారులు చెబుతున్నారు.
కాగా, జిల్లా పరిశ్రమల శాఖకు సంబంధించి జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉండటం తో ఆ శాఖకు సంబంధించిన డిప్యూటీ డెరైక్టర్ హైదరాబాద్‌లో ఉంటూనే జిల్లా పరిశ్రమలశాఖ ఇన్‌చార్జి జీఎంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విధుల నిర్వహణ సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా రుణాలు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
ఆర్నెళ్లక్రితం దరఖాస్తు చేసుకున్నా..
సొంతంగా రైస్‌మిల్లు నెలకొల్పాలని రూ.50 లక్షల అంచనా వ్యయంతో జిల్లా పరిశ్రమలశాఖ ద్వారా రుణం ఇప్పించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ రుణాల మంజూరు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. రుణం మంజూరవుతుందనే నమ్మకంతో మరో పనిపై దృష్టిపెట్టలేకపోతున్నా..
- శంకర్, మక్తల్
రుణం కోసం ఎదురుచూస్తున్నా..
నాలుగు నెలల క్రితం డికార్డ్‌గేట్ మిషన్ (వేరుశనగను వలిచే యంత్రం)నెలకొల్పేందుకు పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూలను త్వరలో నిర్వహిస్తామని చెప్పడంతో యూనిట్‌కు సంబంధించిన స్థలం, ఇతర వసతులను సిద్ధం చేసుకున్నాం. పరిశ్రమల శాఖ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. రుణం కోసం ఎదురుచూస్తున్నా..
- పద్మావతి, మహబూబ్‌నగర్
ఎంపిక ఎప్పటికో..
పేపర్‌ప్లేట్ల యంత్రాన్ని నెలకొల్పేందుకు పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్నా.. ప్రభుత్వపరంగా సబ్సిడీ రుణం మంజూరైతే తద్వారా పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమను నడుపుదామని భావించాను. ఖాదీబోర్డు ద్వారా సబ్సిడీ రుణం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమల శాఖ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపికచేయడం లేదు.
- భాస్కర్‌రెడ్డి, వనపర్తి