
సందడిగా సృజనోత్సవం
పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు సృజనోత్సవాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.
విద్యారణ్యపురి : పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు సృజనోత్సవాలు నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. కొందరు చిన్నారులు తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తుండగా మరికొందరు విద్యార్థులు తిలకిస్తూ కేరింతలు కొడుతూ వారిని ప్రోత్సహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్, లష్కర్‌బజార్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ప్రతిభాపాటవ పోటీల సృజనోత్సవం రెండో రోజూ కనుల పండువగా కొనసాగింది.
గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి : డీఈఓ విజయ్ కుమార్
గ్రామ స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలని, అందుకు భవిష్యత్తులో మండల, డివిజన్ స్థాయిల్లో కూడా సృజనోత్సవం నిర్వహించాలనే ఆలోచన ఉందన్నారు. రెండోరోజు సృజనోత్సవంలో భాగంగా బుధవారం మర్కజీ హైస్కూల్‌లో జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడుతూ విద్యార్థులకు ఏ ఆంశంలో ఆసక్తి ఉందో గమనించి ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు.
ఐఅండ్‌పీఆర్ డిప్యూటీ డెరైక్టర్ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. వచ్చే నెలలో కాకతీయ కల్చర్ ఫెస్ట్‌ను కూడా కలెక్టర్ నిర్వహించబోతున్నారని, అందులో కూడా విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. డివిజనల్ పీఆర్‌వో శ్రీనివాస్, ఎన్‌ఐసీ అధికారి విజయకుమార్, సృజనోత్సవం కార్యదర్శి, హెచ్‌ఎం ఇ. దేవేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ వల్స పైడి, బాధ్యులు రహమాన్ మాట్లాడారు.
పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది
సృజన్సోతవంలో నేను నాటిక పోటీల్లో పాల్గొనటం ఆనందంగా ఉంది. చిన్నోడు నాటికలో డాక్టర్ పాత్ర పోషించాను. నాకు నాటికలంటే ఇష్టం. భవిష్యత్తులో నిజంగా డాక్టర్ కావాలనేది లక్ష్యంగా చదువుకుంటున్నాను. డాక్టర్ పాత్రలో సంతృప్తిగా చేశాను.
- జి. అభిషేక్, శ్రీనివాస రామనుజం హైస్కూల్, ఉనికిచర్ల
పేరిణి లాస్యంలో ప్రతిభ చూపాను
సృజనోత్సవం ప్రతిభాపాటవ పోటీ ల్లో పేరిణి లాస్యం నృత్యం పోటీలో పాల్గనడం ఆనందంగా ఉంది. నేను పేరిణిలాస్యంపై ఉన్న మక్కువతో శిక్షణ కూడా తీసుకుంటున్నా. ప్రతిభ ను నిరూపించుకునేందుకు మంచి అవకాశం దొరికినట్లు భావిస్తున్నా. సృజనోత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి.
- వి. రాగశ్రీ తేజస్వీ హైస్కూల్, హన్మకొండ