వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా! | Saddula Bathukamma Celebrations At Tank Bund | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 18 2018 2:56 AM | Last Updated on Thu, Oct 18 2018 9:32 AM

Saddula Bathukamma Celebrations At Tank Bund - Sakshi

బుధవారం ట్యాంక్‌బండ్‌ వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు..

సాక్షి, హైదరాబాద్‌: ‘మా బంగారు బతుకమ్మ.. పో యిరావమ్మా’, ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’, అని పాడుతూ.. బుధవారం సాయంత్రం సద్దుల బతుకమ్మకు తెలంగాణ ఆడపడుచులు ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ పైనున్న బతుకమ్మ ఘాట్, లలితకళా తోరణం, రవీంద్రభారతిలతోపాటు నగరంలోని వివిధ చెరువు గట్ల వద్ద బుధవారం బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఆ«ధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆడపచుడుల ఆటపాటలు, టపాసుల వెలుగుల మధ్య బతుకమ్మ నిమజ్జన సంబరం అంబరాన్నంటింది. దీనికితోడు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం నుంచి కుండపోత వర్షం కారణంగా ప్రారంభంలో హుస్సేన్‌సాగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల వారు తప్ప.. ఇతర ప్రాంతాలవారు పెద్దగా కనిపించలేదు. కానీ..వర్షం తెరిపిచ్చిన తర్వాత (రాత్రి 7.45 అనంతరం) ఒక్కొక్కరుగా వేలాది మంది బతుకమ్మ ఘాట్‌ చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌ పండుగశోభ సంతరించుకుంది. బ్రహ్మకుమారీలు కుల్‌దీప్‌ సిస్టర్స్, సంతోష్‌ దీదీ సిస్టర్స్‌ బతుకమ్మలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

శోభాయమానంగా సాంస్కృతిక యాత్ర 
బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ఆడపడుచులు, 850 మంది కళాకారుల ప్రదర్శనలు, వారిని చూసేందుకు వచ్చిన ఆశేష జనంతో ట్యాంక్‌బండ్‌ కిటకిటలాడింది. అంబేద్కర్‌ విగ్రహం వద్ద సాంస్కృతిక యాత్ర (కల్చరల్‌ కార్నివాల్‌)ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణలు జెండా ఊపి ప్రారంభించారు. చిందు, యక్షగాన, బైండ్ల, ఒగ్గు, డప్పులు, కొమ్ము కొయ్య, లంబాడీ, గుస్సాడీ, చిరుతల భజన, డోళ్లు మ్రోగిస్తూ కళాకారులు బతుకమ్మలతో కలిసి ముందుకుసాగారు. మహారాష్ట్ర కళాకారులు నిర్వహించిన ‘డోల్‌ తాషా’నృత్యం యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగే పండుగల్లో బతుకమ్మ పండుగ తెలంగాణకు ఓ బ్రాండ్‌గా మారిందని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ మంది ఒకచోట చేరి నిర్వహించుకునే ఏకైక పండుగ ఇదేనన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడం ద్వారా.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాలన్నారు. 


హుస్సేన్‌ సాగర్‌ వద్ద బాణసంచా వెలుగుల మధ్య అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు 

లేజర్‌ షోతో బతుకమ్మ కథ
మారియట్‌ హోటల్‌ సమీపంలో హుస్సేన్‌సాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన లేజర్‌ షో ఆకట్టుకొంది. బతుకమ్మ కథను లేజర్‌ షో ద్వారా ప్రజలకు వివరించారు. పబ్బుల్లో లాగా డ్యాన్స్‌ఫ్లోర్‌ ఏర్పాటు చేసి బతుకమ్మ బొమ్మలు, కథలు వివరించారు. 75 మంది మహిళా విదేశీ కళాకారులు బతుకమ్మ చేపట్టి బతుకమ్మ ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను చూసేందుకు జనం ఎగబడటంతో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులకు తిప్పలు తప్పలేదు. హుస్సేన్‌ సాగర్‌ నీటిలో ఫాటింగ్‌ బతుకమ్మలను పది చిన్న పడవ (పుట్టి)ల్లో ఉంచారు. అయితే.. వర్షం కారణంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించిన పారామోటరింగ్, బెలూన్‌ కార్యక్రమాలు వాయిదా వేశారు. మొత్తం అయిదు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలు గురువారానికి వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అకాల వర్షం కారణంగా ‘ఆకాశంలో బతుకమ్మ’కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు అధికారులు చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement