సాక్షి, హైదరాబాద్: వైరస్‌లను కట్టడి చేసే వ్యాక్సిన్లను తయారుచేయడం అంత ఆషామాషీ కాదని, సాధారణ పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ తయారీకి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని అంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ రఘు డీకే. అన్నీ నిర్ధారించుకోకుండా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి పంపితే అది కరోనా కంటే ప్రమాదకారిగా మారుతుందని అంటున్నారాయన. ఉదర సంబంధ వ్యాధులున్న వారు ఈ కరోనా వైరస్‌కు గురయ్యే అవకాశాలు తక్కువేనని, అయితే, కరోనా ప్రాథమిక లక్షణాలతో పాటు కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడమే మంచిదంటున్నారు ఈ యూఎస్ ఫెలోషిప్ వైద్యుడు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ఉదర సంబంధిత వ్యాధులున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వాటితో పాటు అవి ఉంటే...!
వాస్తవానికి... దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం లాంటివే కరోనా ప్రాథమిక లక్షణాలు. కానీ, పాజిటివ్ వచ్చిన కొన్ని కేసుల్లో కడుపునొప్పి, డయేరియా, ఆకలి మందగించడం లాంటివి కూడా కనిపించాయి. అంటే కరోనా ప్రాథమిక లక్షణాల్లో ఏ ఒక్కదానితో అయినా ఉదర సంబంధిత కడుపునొప్పి, డయేరియా, ఆకలి తగ్గిపోవడం లాంటివి కనిపిస్తే పరీక్ష చేయించుకోవడమే మంచిది. ఎందుకంటే కరోనా వైరస్ పేగులపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
వాటికేం సంబంధం ఉండదు..
కడుపులో మంట, అజీర్తి, గ్యాస్, అల్సర్ ఇలాంటి లక్షణాలున్న వారికి కరోనా వైరస్ సోకితే పెద్ద ప్రమాదం ఉంటుందని చెప్పలేం. ఈ వ్యాధులకు కరోనాకు సంబంధం ఉండదు. కానీ, షుగర్, బీపీ, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసు పైబడిన వారు అసలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. వారికి వైరస్ సోకితే చాలా ప్రమాదకరం.
క్వారంటైన్‌లో ఉన్నప్పుడు జాగ్రత్త
వైరస్ సోకిన వారికి ఉదర సంబంధిత వ్యాధులు ముదురుతాయా లేవా అన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ క్వారంటైన్‌లో ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వారంటైన్‌లో ఉన్నవారు సమయానికి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. వ్యాయామం చేయాలి. ఆల్కహాల్ తీసుకోవద్దు. ఉదరసంబంధ వ్యాధులున్న వారు (గ్యాస్ట్రో సమస్యలు) క్వారంటైన్‌లో జాగ్రత్త తీసుకోకపోతే అవి ముదిరే అవకాశం మాత్రం ఉంది.
ఎలక్ట్రొలైట్స్ తగ్గిపోతే గుండెకు ముప్పు
లాక్‌డౌన్ కారణంగా మద్యం మానేసిన వారికి ఉదర సంబంధ సమస్యలేవీ రాకపోవచ్చు. మద్యం తాగకపోవడం కాలేయం, మూత్రపిండాలకు మంచిదే. కానీ, మానసిక సమస్యలు మాత్రం వస్తాయి. వీటితో పాటు శరీరంలో ఎలక్ట్రొలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్పరస్ లాంటి మూలకాలు) హెచ్చు తగ్గులు వస్తే మాత్రం గుండెకు ముప్పు ఉంటుంది.
మన ప్రభుత్వాల చర్యలు భేష్
కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. మిగిలిన దేశాలన్నింటికన్నా ముందే మనం సురక్షిత చర్యలు ప్రారంభించాం. లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేయాలన్నది ఇదమిత్థంగా చెప్పడం కష్టం. మన దేశంలో రోజురోజుకూ కేసుల లోడ్ పెరుగుతోంది. లాక్‌డౌన్ ఎత్తేసే అంశానికి ఒకటే ప్రాతిపదిక ఉండాలి. కనీసం వారం నుంచి 10 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కావద్దు. లేదంటే కనీస సంఖ్యలో రావాలి. అప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేత గురించి ఆలోచించాలి. ఉన్నట్టుండి లాక్‌డౌన్ ఎత్తేస్తే ప్రజలు మళ్లీ కలసిపోవడం వలన పెద్ద స్థాయిలో వైరస్ లోడ్ అయ్యే అవకాశముంది. అందుకే అప్పుడు కూడా హాట్‌స్పాట్లను మినహాయించాలి. అక్కడ లాక్‌డౌన్ కొనసాగిస్తూనే మిగిలిన ప్రాంతాల్లో దశల వారీగా ఎత్తేయడమే మంచిది.
సాధారణంగా రెండేళ్లు పడుతుంది
వైరస్ నియంత్రించే వ్యాక్సిన్లను కనుగొనడం ఆషామాషీ కాదు. అసలు వైరస్ జీనోమ్ ఏంటన్నది గుర్తించాలి. దానిపై అధ్యయనం చేయాలి. జంతువులు, మనుషులపై ప్రయోగాలు జరపాలి. వాటినీ అధ్యయనం చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్నది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే వ్యాక్సిన్‌ను విడుదల చేయాలి. అలాంటిది జరగకుండా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తే కరోనా వైరస్ కన్నా అది ప్రమాదకారి అవుతుంది. ఇదంతా జరగడానికి సాధారణ పరిస్థితుల్లో అయితే రెండేళ్లు పడుతుంది. కానీ, ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది కాబట్టి ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వనరులు, ప్రయోగశాలలు అనుకూలిస్తాయి కనుక ఎక్కువగా అక్కడే పరిశోధనలు జరుగుతున్నాయి. మన దేశంలో కూడా అన్ని సౌకర్యాలున్నాయి. మంచి శాస్త్రవేత్తలున్నారు. వ్యాక్సిన్ కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. సీసీఎంబీ లాంటి సంస్థలు వర్కవుట్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనేది నా అభిప్రాయం.
‘పాజిటివ్’రావద్దంటే నెగెటివ్‌గానే..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటి కన్నా ముఖ్యమైనది భౌతిక దూరం పాటించడం. ఇంట్లోనే ఉండటం. పని ఉంటే తప్ప ఎవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు. ఎవరిని చూసినా వైరస్ ఉందేమో అనే భావనతోనే మెలగాలి. ఇది నెగెటివ్ మైండ్‌సెట్ కాదు. ప్రస్తుతం ఇదే పాజిటివ్. కరోనా పాజిటివ్ రావద్దంటే ఇదే మైండ్‌సెట్ ఉండాలి. అవసరం లేని మందులు వాడే ప్రయత్నం చేయకండి. క్వారంటైన్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించండి. వయసు మీద పడిన వారికి మరింత జాగ్రత్త అవసరం.
Comments
Please login to add a commentAdd a comment