సతీమణి మాధవి, ఇద్దరు కుమారులతో కసిరెడ్డి నారాయణరెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: మాది తలకొండపల్లి మండలం ఖానాపూర్. నాన్న కీ.శే.కసిరెడ్డి దుర్గారెడ్డి, అమ్మ కీ.శే.కిష్టమ్మ. మేము ఐదుగురం సంతానం. అన్నలు రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, అక్క యశోద, పరమేశ్వరమ్మ. నేను చివరివాడిని. అన్నలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు, నా సతీమణి మాధవి. పిల్లలు దుర్గాప్రసాద్ బీటెక్ పూర్తి చేశాడు. కృష్ణ వంశీధర్‌రెడ్డి ఏడో తరగతి చదువుతున్నాడు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వ్యవసాయం చేసి మా అందరినీ చదివించాడు. చిన్నప్పుడు ఇంటర్ వరకు వ్యవసాయ పనులను చేశాను.
నాగలి దున్నడం, కరిగెట చేయటం వంటి పనులు చేశాను. అన్నలు జీతగాళ్లతో సమానంగా పనిచేసే వాళ్లని, అప్పట్లోనే మా నాన్న, మాకు ఉన్న 300 ఎకరాల భూమిలో 100ఎకరాలను మాత్రమే ఉంచుకొని, చుట్టు పక్కల వాళ్లకి, బీసీ వర్గాలకు 200ఎకరాలు దానంగా ఇచ్చేశాడు. కష్టపడే తత్వం నాన్న నుంచి నేర్చుకున్నాను. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలన్నదే మా అమ్మ, నాన్న ఆశయం. క్రమశిక్షణతో పెంచారు. వారి ఆశయాలకు అనుగుణంగానే చదువుకున్నాం.
విద్యాభ్యాసం.. విద్యాసంస్థల ఏర్పాటు..
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చుక్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్ షాద్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఇంజనీరింగ్ బీటెక్ హైదరాబాద్‌లో, ఎంటెక్ రాజస్థాన్‌లోని సింగానియా యూనివర్సిటీలో పూర్తి చేశాను. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అద్దె రూముల్లో ఉండి చదువుకునే వాడిని. ఖర్చుల కోసం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడిని.
దాదాపు 50మంది వరకు విద్యార్థులు వచ్చేవారు. అప్పుడే ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే, పగలు కూడా బోధన చేయవచ్చనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే దిల్‌సుఖ్‌నగర్‌లో 1986–87లోనే బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఏర్పాటు చేశా. పదేళ్ల పాటు ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా బ్రిలియంట్ ఉన్నత పాఠశాలను కొనసాగించాం. ఇంటర్ తర్వాత చాలా మంది విద్యార్థులకు ఐఐటీలో సీటు సంపాదించడం కష్టంగా ఉండేది. దీనికి కారణం అన్వేషిస్తే, బేసిక్స్ లేకపోవడమే అని అర్థమైంది. విద్యావేత్తలు, రిటైర్డ్ ప్రొఫెసర్లతో చర్చింది.. ప్రొఫెసర్లు కసిరెడ్డి కొండల్‌రెడ్డి, కమాన్, సిద్దాంతి, క్రిష్టమూర్తి, శ్రీనివాసరావు లాంటి ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించా.
ఐఐటీ కోచింగ్ ఎనిమిదో తరగతి నుంచే ప్రారంభించాం. దేశంలోనే ఇంటిగ్రేటెడ్ కరికులమ్ మా పాఠశాలలోనే ప్రారంభమైంది. మేము సక్సెస్ అయిన తర్వాతనే శ్రీ చైతన్య, నారాయణ వంటి పాఠశాలల్లో అమలు చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలంగాణలో 64 బ్రిలియంట్ గ్రామల్ స్కూళ్లను ఏర్పాటు చేశాం. వాటిలో 40వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఫీజులు ఉంటాయి. అలాగే మూడు ఇంజనీరింగ్ కళాశాలలు రామోజీ ఫిల్మ్‌సిటీ దగ్గర ఉన్నాయి. వాటిలో 12వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 4వేల మందికి పైగా టీచర్లు, ఇతర సిబ్బంది విద్యాసంస్థలలో పనిచేస్తున్నారు.
బాధ కలిగించిన అంశం..
కొంతమంది అవసరం కోసం వెంటనే ఉండి, అవసరాలు తీర్చుకున్న తర్వాత నమ్మక ద్రోహం చేశారు. అవసరం తీరిన వారు తిరిగి ఎప్పుడూ కనిపించకపోతే బాధ కలుగుతుంది. అలాగే ఆమనగల్‌లోని మా ఇంటర్, డిగ్రీ కళాశాలకు వచ్చే దాదాపు 50శాతం మంది విద్యార్థులకు పైగా చెప్పులు ఉండేవి కావు. తల్లిదండ్రుల సమావేశ ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలామంది చెప్పులు లేకుండా వచ్చేవారు. వారి ఆర్థిక పరిస్థితి చూసి బాధ కలిగేది. అందుకే చాలా మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం.
సంతోషం కలిగించే అంశం..
మా విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చినప్పుడు, ఐఐటీ వంటి ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు విమర్శించిన వారే ఆ తర్వాత పొగిడినప్పుడు, మా విద్యార్థులు ఇతర దేశాల్లో, దేశంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందిన సందర్భాలలో సంతోషం కలిగేది. నాకు వేంకటేశ్వరస్వామి ఇష్టమైన దైవం, క్రికెట్ అంటే చాలా ఇష్టం.
రాజకీయ నేపథ్యం
ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అప్పట్లో ఓ నేత హామీ మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో స్థానిక కార్యకర్తలు, నేతల ప్రోద్బలంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. కల్వకుర్తి ప్రాంతానికి అందుబాటులో ఉండి సేవ చేయాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌లో చేరాను. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో విజయం సాధించాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను మంత్రుల సహకారంతో ఎమ్మెల్సీ అయిన తర్వాత నెరవేర్చగలిగాను.
ఇన్నేళ్ల జీవితంలో రాజకీయంలోకి వచ్చిన తర్వాతనే నమ్మక ద్రోహంచూశాను. ప్రభుత్వ సహకారంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తీసుకురావడానికి కృషి చేశాను. సంజాపూర్ వద్ద కాల్వల కోసం రైతులకు సొంతంగా భూ పరిహారం చెల్లించి కేఎల్‌ఐ కాల్వలు పూర్తి చేశాను. ప్రస్తుతం 34వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేటీఆర్ చొరవతోనే చారకొండ, వంగూర్, ఊర్కొండ మండలాలలను కలుపుతూ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధించడం చాలా సంతోషకరమైన అంశం.
ఆమెదే కీలకపాత్ర..
నేను నా సొంత ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మా నాన్న పేరుపైన కేఆర్‌డీఆర్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశా. 15వేల మంది విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా స్కాలర్‌షిప్‌తోనే విద్యను అందిస్తున్నాం. విద్యాభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందనేది నా నమ్మకం. మా విద్యాసంస్థలు విస్తరించడంలో నా సతీమణి మాధవి పాత్ర కూడా కీలకమనే చెప్పాలి.
ఆమె కూడా ఎమ్మెస్సీ బీఈడీ చేసింది. టీచర్‌గా బోధన చేయడంతో పాటు విద్యాసంస్థల నిర్వహణ చూసుకుంటున్నారు. కుటుంబ వ్యవహారాలను అన్నింటినీ ఆమెనే చూసుకుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు వంద కు పైగా ప్రభుత్వ పాఠశాలలో సొంతంగా ఒక్కో పాఠశాలకు రూ.లక్ష ఖర్చు చేసి ప్రయోగశాలలు ఏర్పాటు చేయించా.
Comments
Please login to add a commentAdd a comment