సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ వెల్లడించారు. టెండర్ ఓటింగ్ (చాలెంజ్ ఓటు) 0.1 శాతం కంటే ఎక్కువ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పామని, వారి నివేదిక ఆధారంగా రీపోలింగ్‌పై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలింగ్ నాడు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని, వీటి పరిధిలో ఏవైనా ఐటీ సంస్థలు ఉన్నా లోకల్ హాలిడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
మున్సిపల్ ఓటర్లు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఓటు వేసేందుకు 2, 3 గంటల పర్మిషన్ ఇవ్వాల్సిందిగా యాజమాన్యాలను కోరామన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పట్టణాల్లో పోలింగ్ శాతం తగ్గిపోతున్నందున, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించామని, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసిన ప్రచారంతో పోలింగ్‌శాతం 75 శాతానికి పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, 21న నిశితంగా వాటిని పరిశీలించాకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్‌బూత్‌లకు తీసుకు వెళ్లేలా చూస్తున్నామన్నారు. ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ చేసిన ఏర్పాట్లపై కార్యదర్శి అశోక్‌కుమార్‌తో ‘సాక్షి’ ప్రతినిధి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...
ఎన్నికల ఏర్పాట్లు...
దాదాపుగా పూర్తయ్యాయి. మెటీరియల్ సార్టింగ్, బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 20న అన్ని మున్సిపాలిటీల్లో తుది ఏర్పాట్లను పరిశీలిస్తాం. ఫర్నిచర్, మంచినీరు ఇతర కనీస సదుపాయాల పరిశీలన. 21న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ బృందాలు, రిటర్నింగ్, పోలింగ్ అధికారులు ఖరారై, మెటీరియల్‌తో సహా ఆ రోజు మధ్యాహ్నం నుంచే కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళతారు.
పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు..
ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డుల్లో 7,961 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. పోలింగ్ సిబ్బంది 52,757 మందికి ర్యాండమైజ్ చేసి శిక్షణనిచ్చాం. వారిలో 40 వేల మంది విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్‌కు 5 వేల మంది ఉంటారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఇద్దరేసి పోలీ సులుంటారు. మొత్తం 53,55,942 ఓటర్లున్నారు.
డబ్బు జప్తుపై...
డబ్బు జప్తు విషయంలో పోలీసులు, ఇతర అధికారులు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు చేయాలని ఆదేశించాం. పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పంట అమ్మిన మొత్తం, వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఇలా తగిన కారణాలు చూపితే అటువంటి వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించాం.
వెబ్‌కాస్టింగ్...
వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తాం. కచ్చితంగా 30% పోలింగ్ స్టేషన్లు కవరవుతాయి. సున్నిత, అతిసున్నితమైన పోలింగ్ బూత్‌ల్లో తప్పనిసరిగా ఉంటుంది.
వ్యయపరిమితి పెంచే యోచన..
అభ్యర్థుల వ్యయ పరిమితి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.5 లక్షలు, ఇతర కార్పొరేషన్లలో రూ.లక్షన్నర, మున్సిపాలిటీల్లో రూ.లక్ష ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ఈ మొత్తం ఎక్కువగానే ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకల్లా సమీక్షించి అక్కడ పరిమితి పెంచే అవకాశాలున్నాయి.
కౌంటింగ్ కేంద్రాలు...
అందుబాటులో ఉన్న స్థలం, సౌకర్యాల ప్రాతిపదికన సంబంధిత జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను రెవెన్యూ డివిజన్ హెడ్‌క్వార్టర్లు, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment