జిల్లాలో మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశించారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశించారు. సోమవారం నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులను, సిబ్బందినుద్దేశించి జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు ప్రతి పోలీసు అధికారి నడుచుకొని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా బందోబస్తు విధులు నిర్వర్తించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత చేపట్టాలన్నారు. రెండు పారా మిలటరీ ప్లటూన్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
అనంతరం కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి బందోబస్తు విధులకు సంబంధించి పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. అభ్యర్థితోపాటు ఒక్క కౌంటింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు. అలాగే ఎవరూ కూడా సెల్‌ఫోన్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురాకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల మేరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంద న్నారు. అలాగే పోలీస్-30 యాక్ట్ అమలులో ఉన్నందున కడప కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటిల పరిధిలో ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం లాంటివి నిషిద్ధమని హెచ్చరించారు.