టిమ్‌ మరిచిన కండక్టర్‌.. | Sakshi Special Story On TSRTC Strice Effect In Rural Areas | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె; కదలని పల్లె చక్రాలు

Published Sat, Oct 26 2019 8:22 AM | Last Updated on Sat, Oct 26 2019 8:34 AM

Sakshi Special Story On TSRTC Strice Effect In Rural Areas

తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి నేటికి 22రోజులు. రోజుకో రీతిన ఆందోళనలతో రోడ్డెక్కుతున్న డ్రైవర్లు.. కండక్టర్లు.. ఇతర సిబ్బంది జీవితం దుర్భరంగా మారింది. సెప్టెంబర్‌ మాసం జీతం అందక దసరా పండక్కు దూరమైన కార్మికుల జీవితాల్లో.. వెలుగులు నింపే దీపావళి సైతం చీకటినే మిగిలిస్తుందా..? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రోజులు గడుస్తున్నా.. ప్రాణత్యాగాలు జరుగుతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. దీంతో సగటు కార్మికుడి బతుకు‘చక్రం’ ఆగిపోయింది. సమ్మెను తిప్పికొట్టేందుకు సర్కారు ‘ప్రత్యామ్నాయ’ వ్యూహం లాభం చేకూర్చడం లేదనే చెప్పుకోవచ్చు. ‘తాత్కాలిక’ ప్రయాణంలో ప్రజలకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. వరుస ప్రమాదాలతో బస్సుల్లో ప్రయాణం భద్రతనే ప్రశ్నిస్తోంది. కరీంనగర్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో కార్మికుల ఆవేదనలు.. ప్రయాణికుల ఇబ్బందులు.. సంస్థ పరిస్థితులపై ‘సాక్షి’ ఫోకస్‌...

రీజియన్లో రూ.12.6 కోట్ల నష్టం.
కరీంనగర్‌ : ఆర్టీసీ సమ్మె ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేస్తోంది.సమ్మె చేస్తున్న కార్మికులతో పాటు ఆర్టీసీ ప్రయాణాన్నే నమ్ముకున్న ప్రజలకు తిప్పలుతప్పడం లేదు. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు పట్టు విడవకపోవడం... ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎటువైపు దారితీస్తుందో తెలియని సందిగ్ధం నెలకొంది.

ఇక తాడోపేడో...
ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. సమ్మె విరమణకు పరిష్కార మార్గం దొరుకుతుందనుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటైన వ్యాఖ్యలతో సమ్మె ముగింపునకు అవకాశాలు లేకుండా పోయాయి. కార్మికులు సెప్టెంబర్, అక్టోబర్‌ నెల జీతాలను కూడా నోచుకోలేదు.ఆర్టీసీ ఉండే అవకాశం లేదని సీఎం స్పష్టం చేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

భరోసా లేని ప్రయాణం...
ప్రస్తుతం ఆర్టీసీలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బస్సులు తిరుగుతున్నా సమయపాలన లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాము పనిచేసే చోటికి సమయానికి వెళ్లలేకపోతున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల యజమానులు సందిట్లో సడేమియాలాగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు.

బస్సులు ఫుల్‌... కలెక్షన్‌ నిల్‌...
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కరీంనగర్‌ రీజియన్‌లో భారీ నష్టం వాటిల్లింది. గతంలో ప్రతి రోజు రూ.1.10 కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుతం రూ.50 లక్షల పైచిలుకు మాత్రమే ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 90 శాతం బస్సులు నడిస్తే ఇంత అధ్వానంగా కలెక్షన్‌ ఎలా వస్తుందనేది జవాబు లేని ప్రశ్నగా మారింది. ప్రతి రోజు 60 లక్షల పైగా నష్టం వాటిల్లుతుండడంతో రీజియన్లో 9డిపోల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
చదవండి : సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ అదే పని

నిలువు దోపిడీ..
సిరిసిల్లటౌన్‌: సమ్మెకు ముందు సిరిసిల్ల డిపో పరిధిలో 65 బస్సులు ప్రతిరోజు సుమారు 300 ట్రిప్పుల్లో 25వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేవి. సిబ్బంది లేక డిపోలో డీఎం ఒక్కరే పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖ తదితర శాఖల అధికారుల సహకారంతో బస్సులను నడిపిస్తున్నారు. 65 బస్సుల్లో ప్రతిరోజు 90శాతం నడిపిస్తున్నారే కానీ ట్రిప్పులు తగ్గాల్సి వచ్చింది. 

అందినకాడికి దోపిడీ..?
జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్న సిబ్బందికి ఆర్‌ఎం నుంచి వచ్చిన చార్ట్‌ ద్వారా టిక్కెట్‌ ధరలు వసూళ్లు చేయాల్సి ఉంది.అయితే ఇప్పటికీ అద్దె, ప్రైవేటు బస్సుల్లో  ఇష్టానుసారంగా వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తో్తంది.కొన్ని రూట్లలో అధికారులు టిమ్‌ మిషన్లద్వారా టిక్కెట్లు ఇప్పిస్తుండగా..తాత్కాలిక సిబ్బంది చిల్లరలేమి పేరుతో ఎక్కువ తీసుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. కరీంనగర్‌ నుంచి కామారెడ్డికి ఆర్డీనరీ చార్జీలు రూ.60కి బదులు రూ.100 వసూలు చేస్తున్నారు. 

ఆదాయం పెంచిన టిమ్‌ మిషన్లు?
వారం రోజుల నుంచి ఎక్కువ రూట్లలో టిమ్‌మిషన్లను వినియోగించడంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో ఆదాయం పెరుగుతూవస్తోంది. సిరిసిల్ల డిపోలో 70శాతం మేరకు టిమ్‌ మిషన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.టిమ్‌ మిషన్ల నిర్వహణలో తలెత్తుతున్న టెక్నికల్‌ సమస్యలు అధికారులకు తలనొప్పిగా మారాయి.

పాసులు చెల్లుతలేవు 
సిరిసిల్ల బస్సుల్లోనే పాసులు చెల్లుతున్నాయి. కామారెడ్డి బస్సులో ఎక్కితే చార్జీలు తీసుకుంటుండ్రు. ఇదేం పద్ధతి. క్యాట్‌కార్డులది కూడా అదే పరిస్థితి. ఏ డిపో పరిధిలో తీసుకున్న వాటినే చెల్లుబాటు అవుతున్నాయి. ఇక కళాశాలల సమయానికి బస్సుల్లేక మాకు ప్రయాణానికే రోజుకు నాలుగు గంటల సమయం పడుతుంది. చదువుకునేదెప్పుడు.     – అంకనగరి జాషువా, 
నర్మాల, పాలిటెక్నిక్‌ విద్యార్థి, అగ్రహారం

సమయానికి బస్సులు నడపాలి  
పాసులు చెల్లుబాటు అవతున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు సిరిసిల్ల బస్టాండుకు వచ్చినం. నాలుగన్నర వరకు బస్సులు లేవు. బస్సులు చెల్లుబాటు అవుతున్నాయి. ఆటోల్లో పోదామంటే భయం. పైగా డబ్బులు ఎక్కువ తీసుకుంటుండ్రు. సమ్మె ఎప్పుడు అయిపోతుందాని చూస్తున్నాం. విద్యాసంస్థల సమయానికి బస్సులు నడపాలి. 
– గంగు శృతి విద్యార్థి, చీర్లవంచ

మా బతుకులు రోడ్డున పడ్డాయి
జగిత్యాల: మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. జీతాలు లేకపోవడంతో పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. ఇటీవలే ఇల్లు కట్టుకున్న కొందరు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం రూ.50 వేల జీతం ఇస్తున్నామని చెబుతున్నారు. మా పే స్లిప్‌లు చూపెడుతున్నాం. రూ.50 వేల జీతం ఇస్తే సమ్మె విరమిస్తాం. ఒక్కో రోజు తినకుండానే నిద్రపోతున్నాం. ఇన్ని సార్లు డీజిల్‌ ధరలు పెరిగినా.. ప్రభుత్వం ఓట్ల కోసం టికెట్ల రేట్లు పెంచడం లేదు. ప్రజలంతా మాకు మద్దతివ్వాలి. మమ్మల్ని ఆదుకోవాలి.
– ఉమారాణి, ఆర్టీసీ కార్మికురాలు

టిమ్‌ మరిచిన కండక్టర్‌
మంథని: పక్క చిత్రం చూశారా..! మంథని బస్టాండ్‌లో గోదావరిఖనికి బోర్డుతో ప్లాట్‌ఫాంపై బస్సు ఆగింది. అప్పటికే బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు వెళ్లి బస్సులో కూర్చున్నారు. 30 మందితో బస్సు పట్టణశివారు దాటింది. తాత్కాలిక కండక్టర్‌ టిమ్‌ మిషన్‌ పట్టుకొని ఓ ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి సార్‌ ఎక్కడికి అన్నాడు. గోదావరిఖని ఒక టికెట్‌ అనగానే.. కండక్టర్‌ మిషన్‌లో గోదావరిఖని ఎంటర్‌ చేసే ప్రయత్నం చేశాడు. టికెట్‌ బయటకు రాలేదు. ఎందుకంటే తాత్కాలిక కండక్టర్‌ దగ్గర ఉన్నది భూపాలపల్లి రూట్‌ టిమ్‌. ఆగమైన కండక్టర్‌ వెంటనే డ్రైవర్‌కు చెప్పి బస్సును బస్టాండ్‌ తీసుకెళ్లాడు. బస్సులోని ప్రయాణికులు దిగి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టిమ్‌మార్చుకుని బయల్దేరాడు.
 

ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదు
గోదావరిఖనిటౌన్‌: ఇన్నాళ్లుగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్లిన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేయడం సరికాదు. అందరం మానవులమే. వారికి అవసరాలు ఉంటాయని చూడని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందా, మరి ఎవరి కోసం పని చేస్తుందనేది తెలియలేని స్థితి నెలకొంది.                     
 – రాజయ్య, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ 

రూ.20వేల అప్పు..
ఇతను వేల్పుల ప్రభాకర్‌. 25 ఏళ్లుగా హుజూరాబాద్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అన్ని కటింగ్‌లు పోనూ నెలజీతం రూ. 16వేలు చేతికి వస్తుంది. హార్ట్‌ సర్జరీ కావడంతో నెలకు రూ.3వేలు మందులకే ఖర్చు అవుతోంది. 21రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వం సెప్టెంబర్‌ జీతాలు నిలిపివేసింది. ఇల్లుగడిచేందుకు ప్రభాకర్‌ వడ్డీకి రూ.20వేల అప్పు తీసుకొచ్చాడు. కుటుంబపోషణ కష్టంగా ఉందని.. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ప్రభాకర్‌ కోరుతున్నాడు.

విధులకు ఆలస్యం..
ఇతను కుక్కడపు శ్రీనివాస్‌. మంథని స్వస్థలం. గోదావరిఖని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం 9.30కి కళాశాలలో బయోమెట్రిక్‌ వేలిముద్ర వేయాలి.కాలేజీకి వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 7.45కి మంథని బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సురావడంతో ఎక్కాడు. బస్టాండ్‌ నుంచి ఓ సారి డిపో వరకు తీసుకెళ్లిన డ్రైవర్‌.. గోదావరిఖని బయల్దేరి.. కొంతదూరం వెళ్లి వెనక్కి వచ్చాడు. దీంతో మంథనిలోనే తొమ్మిది కావొచ్చింది. అరగంటలో ఎలా వెళ్లేదని శ్రీనివాస్‌ మదనపడగా.. ప్రత్యామ్నాయం లేక అదే బస్సులో ఆలస్యమైనా కళాశాలకు వెళ్లాడు..

రోజుకు ఒక్కపూటే తింటున్నం
కోరుట్ల: నా పేరు విజయ.మల్యాల మండల రామన్నపేట. కోరుట్ల డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు.నెలకు రూ. 16వేలు జీతం వస్తుంది. నా భర్త రాజేశ్వర్‌ కూలీపని చేసేవాడు. వెన్నపూస ఆపరేషన్‌ కావడంతో ఇంట్లోనే రెస్టు తీసుకుంటుండు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు 5వ తరగతి, ఇంకొకరు 3వ తరగతి చదువుతున్నారు. నా భర్త తరఫున సంపాదన లేక.. నాకు రెండు నెలలుగా జీతం రాక మస్తు పరేషాన్‌ ఉంది. ఇన్ని రోజులు మిగుల్చుకున్న డబ్బులు బతుకమ్మ..దసరా పండుగకు అయిపోయినయ్‌..ఇప్పుడు మా ఇల్లంతా.. రోజుకు ఒక్క పూటే తిని కాలం గడుపుతున్నం. ఇంట్లో సామానులు లేవు. కిరాణంలో ఉద్దెర పెట్టి తెచ్చుకుంటున్నం. ఈ నెలాఖరులో ఇప్పటి వరకు కిరాణ సామానుకు అయిన డబ్బులు చెల్లించకుంటే వచ్చే నెలలో ఉద్దెర ఇవ్వనని కిరాణ షాపు ఓనరు చెపుతుండు. మా ఆయనకు అవసరమైన మందులు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement