
కోడళ్లు, అల్లుళ్ల జేఏసీలు నిలదీస్తాయ్!
ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త కోడళ్లు, అల్లుళ్లు వస్తే ఉండేందుకు వీలుగా పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీసేందుకు కోడళ్ల జేఏసీలు, అల్లుళ్ల జేఏసీలు తయారవుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం శాసనసభలో ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రం సంధించారు. విద్యార్థి, డాక్టర్ల, లాయర్ల తదితర జేఏసీల సహకారంతో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ నాయకులు ఆపై ఇచ్చిన హామీలను మర్చిపోయారని, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కొత్త జేఏసీలు సన్నద్ధమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సంక్షేమ రంగం, గృహ నిర్మాణానికి కేటాయింపులపై ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో బడ్జెట్ గురించి పేపర్లో చదివితే పేదలు కూడా బిర్యానీ తిన్నట్లుగా ఫీలయ్యేవారని, ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే వారికి బీపీ, షుగర్లు వస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఇళ్ల బకాయిలే రూ.1500 కోట్లుండగా, ఈ ఏడాది హౌసింగ్‌కు బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయన్నారు.
రైతుల ఆత్మహత్యలకు ఇళ్ల బకాయిలు పేరుకుపోవడం కూడా కారణమవుతోందన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ముస్లిం, గిరిజనవర్గాలకు 12 శాతం రిజర్వేషన్లను ఎలా ఇస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. మేడారం సమ్మక్క సారక్కలకు బడ్జెట్‌లో రూ.94 లక్షలే కేటాయిం చారన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు హెలికాప్టర్ ద్వారా వైద్య సేవలందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్.. బడ్జెట్‌లో మాత్రం నాలుగు చక్రాల అంబులెన్స్‌లకు సైతం నిధులు విదల్చలేదని దుయ్యబట్టారు.