మట్టిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ నష్టం రాదన్నట్టే... మట్టిలో వ్యాయామ చేసేవారి ఆరోగ్యం ఎన్నటికీ చెక్కుచెదరదు అంటున్నారు పాతకాలం నాటి వ్యయామ ప్రియులు. ఇక్కడ వ్యాయామం చేసేందుకు ఉంచే దంగల్ మట్టిలో వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను కలుపుతారు. జల్లెడ పట్టిన చెక్కపొట్టు, నూనె, గంధం పౌండర్, పచ్చ కర్పూరం, నిమ్మకాయ రసం, నెయ్యి వంటి పదార్థాలను కలుపుతారు. దీని ద్వారా మట్టి సుగంధభరితమై అలసటను దూరం చేస్తోంది. ఈ మట్టిలో వ్యాయామాలు చేయడం ద్వారా చర్మవ్యాధులు కూడా దూరమవుతాయని ట్రైనర్స్ చెబుతున్నారు.
సనత్‌నగర్: నగరంలో దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన వ్యాయమశాలలకు ఆదరణ పూర్తిగా తగ్గలేదు. సరికొత్తగా పుట్టుకొస్తున్న జిమ్‌ల పోటీని ఎదుర్కొంటున్న స్వదేశీ వ్యాయామానికి మరేదీ సాటి లేదు.. రాదు.. అంటున్నారు పాతకాలం నాటి వ్యాయామశాల నిర్వాహకులు. నాలుగ్గోడల మధ్య ఏసీల మధ్య మెత్తని కార్పెట్స్ మీద చేసే వర్కవుట్స్ సిసలైన శారీరక ఫిట్‌నెస్‌ను అందివ్వలేవని, దంగల్ మట్టిలో చేసే వ్యాయామానికి తిరుగులేదని అంటున్నారు.
బలం.. అ‘పార’ం..
కాయం కష్టిస్తేనే ఆరోగ్యం సిద్దిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇసుక లారీలపై పారలతో పనిచేసే వారిని గమనిస్తే ఆ కాయాకష్టం వారి దేహాన్ని ఏవిధంగా మలుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆనాటి వ్యాయామశాలల్లో మట్టిని నేలపై పోసి పారలతో తవ్వడం, కాళ్లతో దున్నడాన్ని వ్యాయమ ప్రక్రియగా చేర్చారు. పారలతో మట్టిని తవ్వడం ద్వారా కాలి చిటికెన వేలు నుంచి మెదడు వరకు నరాలు ఉత్తేజితమవుతాయి. అలాగే పారకు ఉన్న కర్రను సడలకుండా పట్టుకోవడం అంటే మల్లయుద్ధంలో ప్రత్యర్థిని పట్టుకోవడంలో గ్రిప్‌ను సాధించడమే అన్నమాట. ఈ పారతో వ్యాయామం చేసే మట్టి ప్రాంతాన్ని దంగల్‌గా పేర్కొంటారు. ఆధునిక వ్యాయామ పద్ధతులకు భిన్నంగా ఇక్కడ కేవలం లంగోటిల మీదనే వ్యాయామం చేస్తారు. దీని ద్వారా శరీరంలో ప్రతి అవయానికి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది.
పాతొక వింత..
ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఫిట్‌నెస్ సెంటర్ల ద్వారా ఫిజిక్ షేపులే తప్ప సిసలైన శారీరక దృఢత్వం రాదని, పాతకాలపు వ్యాయామ స్ట్సైల్స్ ద్వారా సిసలైన ఫిట్‌నెస్‌తో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా సంతరించుకోవచ్చన్నది నాటి వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. నగరంలో బల్కంపేట, ఫతేనగర్, బేగంబజార్, గౌలిగూడ, మూసాపేట్, సనత్‌నగర్, కింగ్‌కోఠి, చిలకలగూడ, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్ బీకేగూడ తదితర ప్రాంతాల్లో పాతకాలపు శైలిని కొనసాగిస్తున్న వ్యాయామశాలలు ఇంకా రద్దీగానే ఉన్నాయి. దీనికి కారణం వీటి ద్వారా వచ్చే లాభాలే అంటున్నారు వ్యాయామప్రియులు. మట్టిలో చేసే పలు రకాల వ్యాయామాల గురించి ఇలా చెబుతున్నారు.
ముగ్దార్.. భుజబలం..
పొడవాటి దుంగ మాదిరిగా గుండ్రంగా ఉండే బరువైన ముగ్దార్‌ను రెండు చేతులతో తల వెనుక వైపుగా చుట్టూ తిప్పడం ద్వారా మోచేతులు, భుజ కండరాలు బలోపేతం అవుతాయి. ఈ కసరత్తు కూడా దంగల్ మట్టిలో గానీ, నేలపై తమకు అనుకూలమైన ప్రదేశంలో ఎక్కడైనా చేయవచ్చు.
అస్లీ.. సత్తా..
రింగ్ ఆకృతిలో దాదాపు 40 కిలోల బరువున్న రాయి(అస్లీ) మెడలో వేసుకుని దంగల్ మట్టిని కాళ్లతో దున్నుతారు. దీనిని మెడకు గర్దన్ వ్యాయామంగా కూడా పేర్కొంటారు. ఈ ప్రత్యేకమైన కసరత్తుతో మెడ భాగంలోని నరాలు చైతన్యమవుతాయి. అలాగే మెడలో అంతటి బరువుతో దంగల్‌ను దున్నడం ద్వారా కాళ్ల జాయింట్స్ బలంగా మారతాయి. కాలి కండరాల సామర్థ్యం పెరుగుతుంది.
క్లైంబ్..రోప్
పాతకాలం నాటి వ్యాయామ ప్రక్రియలో రోప్ క్లైంబింగ్ ఒకటి. తాడును ఎక్కి, దిగడం ద్వారా తన బరువును తాము మోసుకుంటూ పైకి వెళ్లడమే కసరత్తు. దీని ద్వారా చేతుల నరాలు రాటుదేలుతాయి. రోప్ ఎక్కి దిగే క్రమంలో సమయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. వయస్సును బట్టి నిర్దేశిత టైమ్‌లో రోప్ క్లైంబింగ్ చేయాల్సి ఉంటుంది.
దమ్ బై టక్ (సపాయ్)..
పాతకాలం వ్యాయామంలో దమ్ బైటక్ ఒకటి. నేలపై అరచేతులు ఉంచి కాలి మునివేళ్లపై నుంచి మొత్తం బాడీని లేపడమే ఈ కసరత్తు. బైటక్(బస్కీలు కొట్టడం) ద్వారా కూర్చొని, లేవడం మరో కసరత్తు. ఇక ‘అతా’ (రెండు వైపులా హ్యాండిల్ కలిగిన పరికరం)పై చేతులు ఉంచి దమ్ బై టక్ చేయడం ఇంకోరకమైన కసరత్తు. ఇది చెస్ట్‌కు మంచి వ్యాయామం.
ఆహారమూ.. సహజమే..
ఈ తరహా వ్యాయామశాలల్లో వర్కవుట్ చేసేవారు నేచురల్ డైట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. శెనగలు, బెల్లం, ఎండుకొబ్బరి, మినపప్పు తదితర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అది కూడా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే.
బార్ బార్ దేఖో..
సమాంతరంగా ఉన్న రెండు రాడ్ల ఆధారంగా బార్ కసరత్తు జరుగుతుంది. వెనుక వైపుగా సింగిల్ రాడ్‌ను రెండు చేతులతో పట్టుకుని మొత్తం బాడీని మెలితిప్పి రెండో రాడ్‌కు కాళ్లను తాకించడమే ఈ కసరత్తు ప్రత్యేకం. ఇది ఛాతీ కండరాలను బలంగా మారుస్తుంది.
ఇదే ఆరోగ్యకరం..
ఆధునిక జిమ్‌ల్లో షూస్, చెప్పులతో చేయిస్తారు. ఇక్కడ చెప్పులకు కూడా అనుమతి ఉండదు. అంతా సహజమైన పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ వస్తాదుగా ఉన్న లక్ష్మయ్య ఇదే వ్యాయామం చేసి 98 ఏళ్లు జీవించాడు. – రాజు, ఖలీఫ్, శ్రీవీర హనుమాన్ వ్యాయామశాల
శరీరం ఉత్తేజితం..
శరీరాన్ని మొత్తం ఉత్తేజితం చేసే వ్యాయాయ పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అందుకే పాతకాలం పద్ధతులైనా ఇలాంటి జిమ్‌ను ఎంచుకున్నాను. నాతో పాటు ఎంతోమంది ఈ జిమ్‌కు వస్తున్నారు. – కార్తీక్, శిక్షకులు
Comments
Please login to add a commentAdd a comment