సాక్షి, హైదరాబాద్: ఖమ్మం పూర్వ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గం అవకతవకలకు పాల్పడుతోందని, దాన్ని రద్దు చేయాలని సహకార శాఖ సిఫారసు చేసి రెండు నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే (జనవరి) నెలాఖరుకే పాలకవర్గ కాలపరిమితి ముగియనుంది. అప్పటివరకు చూసీచూడనట్లుగా వ్యవహరించి డీసీసీబీని గట్టెక్కించేందుకు కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రైతులకు రుణాల మంజూరు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) వర్గాలు పేర్కొన్నాయి.
ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమనిధి పేరుతో రైతుల రుణాల్లోంచి రూ.500 వసూలు చేసిందని టెస్కాబ్ వర్గాలు స్పష్టం చేశాయి. రూ.8.11 కోట్లు వసూలు చేసి ఆస్పత్రి నిర్మించింది. డీసీసీబీ చైర్మన్ పేరు మీదే ట్రస్టు రిజిస్ట్రేషన్ చేశారని, ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసి నెలకు రూ.4 లక్షలు చెల్లిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు నెలల క్రితమే సహకార శాఖకు ఫిర్యాదులందాయి. రైతులకు చెందాల్సిన రుణాలు, నిధులను ఇతర వ్యవహారాలకు ఖర్చు చేయటం చట్ట విరుద్ధమని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సహకారశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు పాలకవర్గం వివరణ ఇచ్చినా, అది రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ స్పష్టం చేసింది. గతంలో వసూలు చేసిన నిధులు అయిపోతుండటంతో మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండటంపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై టెస్కాబ్ ప్రతినిధి బృందం రెండ్రోజుల క్రితం ఖమ్మం వెళ్లి విచారణ చేపట్టింది. దీనిపై ఆ బృందం రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
ఆసుపత్రులు నిర్మించడం బ్యాంకుల పనికాదు
సహకార బ్యాంకులు రైతులకు రుణాలు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలు జరపాలే కానీ ఆసుపత్రులు నిర్మించడం రిజర్వ్ బ్యాంకు నిబంధనలకే విరుద్ధం. దేశంలో ఇలా ఎక్కడా జరగలేదు. ఖమ్మం డీసీసీబీపై వచ్చిన ఆరోపణల గురించి విచారణ జరిపేందుకు ఒక బృందాన్ని పంపించాం. సోమవారం నివేదిక ఇస్తారు.
– మురళీధర్‌రావు, ఎండీ, టెస్కాబ్
Comments
Please login to add a commentAdd a comment