శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) గతేడాది అక్టోబరు 24న అవతరించింది. మార్చి 15న ‘సుడా’కు చైర్మన్‌గా జీవీ రామకృష్ణారావు నియామకం జరిగింది. ‘సుడా’ ఏర్పడి ఎన్నిమిదిన్నర నెలలు కావస్తున్నా.. చైర్మన్ నియామకం జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటికే పూర్తిస్థాయి పాలకవర్గం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ ప్రక్రియ సాగడం లేదు. వీటితోపాటు ‘సుడా’కు ఇంకా విధివిధానాలే ఖరారు కాలేదు. కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో లేఅవుట్, భవన నిర్మాణాల అనుమతులు మంజూరు వ్యవస్థ డోలాయమానంలో పడింది. ‘సుడా’ ఏర్పాటుతో అనుమతుల జారీ ప్రక్రియ తమ పరిధిలోకి రాదని డీటీసీపీ అధికారులు పేర్కొంటున్నారు. ‘సుడా’లో విలీనమైన గ్రామాలకు సంబంధించి పంచాయతీలూ ఇదే మాట చెబుతున్నాయి. దీంతో సుడా పరిధిలో విచ్చలవిడిగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ‘సుడా’ ఏర్పడి ఎనిమిదిన్నర నెలలు.. కమిటీకి చైర్మన్‌ను నియమించి రెండున్నర నెలలు కావస్తున్నా కార్యకలాపాలు సాగకపోవడంపై చర్చ జరుగుతోంది.
పాలకవర్గంపై ప్రతిపాదనలకు మోక్షం ఏదీ..?
శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా)కు రెండున్నర నెలల క్రితం టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు జీవీ రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. అయితే.. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అంటూ సుడా పాలకవర్గం కోసం ఆశావాహులు ఎదురుచూస్తూనే ఉన్నారు. సుడా డైరెక్టర్ల నియామకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. ఆశావాహులు ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తూ డైరెక్టర్ పదవులు పొందేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ద్వారా ‘సుడా’ కమిటీలో చేరేందుకు పలువురు ప్రయత్నాలు చేశారు. అయితే.. చివరకు కమిటీ తుది నిర్ణయ బాధ్యతలను మాత్రం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భుజాలపై వేయగా.. ఆయన అన్నివర్గాల వారికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే 13 పేర్లతో ఒక కమిటీని తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఈ జాబితాపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి ఆమోదించినట్లు కూడా సమాచారం. కాగా.. అందరి సమ్మతంతోనే నేడో రేపో పాలకవర్గాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నా.. ఇంకా జీవో విడుదల కాలేదు.
ప్రతిపాదిత కమిటీలో పేర్లు ఇవే..
సుడా చైర్మన్‌తోపాటు 13 మంది డైరెక్టర్లను నియమించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పెద్దల సూచనల మేరకు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు, మధ్యలో వచ్చి అంకితభావంతో పనిచేస్తున్న వారి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఒక్కో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీని ప్రతిపాదించినట్లు సమాచారం. కమిటీలో తోట మధు, ఐలేందర్‌యాదవ్, భూక్య లావణ్య, షెక్ యూసుఫ్, చీటి రాజేందర్‌రావు, కామారపు శ్యాం, బల్ల ఆంజనేయులు, వంగర రవీందర్, నేతి రవికుమార్, లక్కాకుల మోహన్‌రావు, కాటం సురేష్, వొల్లాల శ్రీనివాస్‌గౌడ్, చికిరి శోభ పేర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే.. ఇందులో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.
‘సుడా’ స్థబ్దతతో భారీగా ఆదాయానికి గండి..
కరీంనగర్ నగర శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా సుడాలో విలీనమైన కరీంనగర్ పట్టణం, సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లిహవేలి, లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటి పరిధిలో వందల ఎకరాల వెంచర్లకు సంబంధించి సుమారు 70 దరఖాస్తులు అనుమతులకు నోచుకోక పెండింగులో ఉన్నాయి. భారీ సంఖ్యలో భవన నిర్మాణ దరఖాస్తుల అనుమతులు అటకెక్కాయి. లేఅవుట్ రుసుం ఎకరానికి రూ.25 వేలకు పైబడి ఉంటుంది. భవన నిర్మాణానికి రూ.5 లక్షల వరకూ ఉంది. ఐదు నెలలుగా అనుమతుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి పడుతోంది. నాలా ఫీజు చెల్లించి లేఅవుటు వేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున వ్యయం చేసి భూ అభవద్ధి చేసిన స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ఆస్కారం లేక గగ్గోలు పెడుతున్నారు.
సుడా పరిధిలోకి వచ్చే ప్రతిపాదిత గ్రామాలు..
కరీంనగర్ పట్టణం, సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లిహవేలి, లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, వల్లంపహాడ్, తీగలగుట్టపల్లి, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్ కొండాపూర్, పకీర్‌పేట్, జూబ్లీనగర్, ఎలబోతారం ,మానకొండూర్: మానకొండూర్, సదాశివపల్లి, బగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్ తిమ్మాపూర్: తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎస్), నుస్తులాపూర్, నేదునూర్, పచ్చునూర్, మన్నెంపల్లి. గన్నేరువరం: చెర్లాపూర్, హన్మాజిపల్లి, గోపాల్‌పూర్, పి.కొండాపూర్, పోత్‌గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్లి, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి.రామడుగు: వన్నారం, కొక్కెరకుంట, దేశ్‌రాజ్‌పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల.చొప్పదండి:కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట గంగాధర: ఒద్యారం.
Comments
Please login to add a commentAdd a comment