- జూలై ఒకటి నుంచి మార్కుల జాబితాలు
- సింగిల్ సబ్జెక్టు తప్పిన వారూ అధికమే..
- మెరుగుపడని ఫలితాలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో గత ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. శుక్రవారం క్యాంపస్‌లోని అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ ప్రొ.సత్యనారాయణ డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్‌తోపాటు, ఇతర వెబ్‌సైట్లలోనూ విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచారు.
బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు చెందిన లక్షా 70 వేల 958 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 52.40 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు జూలై ఒకటి నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చని సూచించారు. ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 16 నుంచి 27 వరకు, రూ.100 అపరాధ రుసుముతో జూలై ఒకటి వరకు ఏపీఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
సింగిల్ సబ్జెక్టులో 9 వేల మంది ఫెయిల్..
వివిధ డిగ్రీ కోర్సుల్లో సింగిల్ పేపర్ తప్పిన వారు తొమ్మిది వేలకుపైగా ఉన్నారు. ఏటా సింగిల్ సబ్జెక్టులో సుమారు పది వేల మంది విద్యార్థులు ఫెయిల్ అవుతూ విద్యకు దూరంగా ఉంటున్నారు. ఇన్‌స్టంట్ లేదా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
పురోగతిలేని ఫలితాలు
ఓయూ డిగ్రీ ఫలితాల శాతంలో పురోగతి కనిపించడం లేదు. ఏటా వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య సుమారు 2 లక్షల వరకు ఉంటున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు కళాశాలలు పెరుగుతోన్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కానీ కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, అనుభజ్ఞులైన అధ్యాపకులు, సరైన బోధన లేనందు వల్లే మెరుగైన ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది. అనేక ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలకు అనుతిస్తున్నట్టు ఆరోపణలున్నా ఓయూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కళాశాలలపై ఓయూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫలితాలు దిగజారి పోతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.