సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో పాత కష్టాలు తప్పడం లేదు. కొత్త నెట్‌వర్క్ ఏర్పాటు ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో రెండు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలను సర్వర్ డౌన్ సమస్య వేధిస్తోంది. దీంతో ఈసీలు, రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత కనీసం ఫొటోలు కూడా అప్‌లోడ్ కావడం లేదని సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్నారు.
సర్వర్ డౌనా.. నెట్‌వర్క్ అంతరాయమా?
రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రోజూ వేలాది రిజిస్ట్రేషన్ లావాదేవీలు నడుస్తాయి. ఇందుకోసం ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్‌లైన్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవసరమైన అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ నుంచి ఫొటోల అప్‌లోడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్కానింగ్ వరకు ఈ వ్యవస్థలోనే పనిచేయాలి. అయితే రెండు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయడం లేదు.
రాష్ట్ర ఐటీ విభాగం ద్వారా నడుస్తున్న సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అన్ని జిల్లాలకు కలిపి హైదరాబాద్‌లో ఒకటే సర్వర్ ఉందని, సర్వర్‌పై లోడ్ ఎక్కువ కావడంతో సమస్య వస్తోందని సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మాత్రం సర్వర్ డౌన్ కాలేదని, కేవలం నెట్‌వర్క్ సమస్య ఏర్పడిందని గురువారం మధ్యాహ్నానికే సమస్య పరిష్కారం అయిందని స్పస్టం చేస్తున్నారు.
కానీ పలు జిల్లాల్లో శుక్రవారం కూడా ఈ సమస్య వచ్చిందని తెలుస్తోంది. గురువారం యాదాద్రి జిల్లా పరిధిలోని భువనగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండంటే రెండే రిజిస్ట్రేషన్లు జరిగాయని సమాచారం.
కొత్త నెట్‌వర్క్ ఎప్పుడు?
గతంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు మన రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకే నెట్‌వర్క్ పరిధిలో ఉండేవి. అయితే తెలంగాణకు ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌లో తలెత్తే ట్రాఫిక్ బిజీని తగ్గించుకోవచ్చని, మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (స్వాన్)తో పాటు ఇండియన్ రైల్వేకు చెందిన ఐటీ సంస్థ రెయిల్‌టెల్ ద్వారా కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది.
అయితే ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకునే మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్‌ఎస్) వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరోవైపు గతంలో ఉన్న విధంగా ఏ జిల్లా సర్వర్‌ను ఆ జిల్లాలోనే ఉంచకుండా అన్నింటిని కలిపేయడంతో ఈ సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్ సహకారంతో ఏర్పాటు చేసుకుంటున్న కొత్త నెట్‌వర్క్‌ను వీలున్నంత త్వరగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment