సాక్షి, హైదరాబాద్: మైనారిటీ వర్గాల పేద యువతుల వివాహాలకు రూ. 51 వేల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ‘షాదీ ముబారక్’ పేరుతో టీ సర్కారు కొత్త పథకాన్ని ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి అమలులోకి రానున్న ఈ పథకం మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందే యువతులకు 18 ఏళ్లు, ఆపై వయస్సు ఉండాలి. మైనారిటీ వర్గానికి, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. వధువు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలి. ఈ ఏడాది అక్టోబర్ 2న, ఆ తర్వాత జరిగే వివాహాలకే ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా మీసేవ సెంటర్ ద్వారా http://epasswebsite.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. పెళ్లి సమయానికి వధువు బ్యాంకు ఖాతాలో నగదును జమ చేస్తారు.
దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాల వివరాలు..
మీసేవ కేంద్రం ద్వారా జారీ చేసిన పుట్టిన తేదీ, కుల ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తు చేసుకునే నాటికి ఆర్నెల్లలోపు జారీ అయిన ఆదాయ ధ్రువీకరణ పత్రం
వధూవరుల ఆధార్ కార్డుల స్కాన్ కాపీ
వధువుకు సంబంధించిన బ్యాంక్ పాస్‌బుక్ స్కాన్ కాపీ
అందుబాటులో ఉంటే వివాహ ఆహ్వాన పత్రిక పెళ్లి ఫొటో
పంచాయతీ/ చర్చి/ మసీదు/ సంస్థలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రం
పదోతరగతి హాల్‌టికెట్ నంబర్, పాసైన సంవత్సరం (ఇవి తప్పనిసరి కాదు)
అక్టోబర్ 2 నుంచి ‘షాదీ ముబారక్’
Published Fri, Sep 26 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement