వేటగాడు 3 | Sharp shooter Nawab Asghar Ali Khan is from Hyderabad | Sakshi
Sakshi News home page

వేటగాడు 3

Published Mon, Nov 5 2018 1:39 AM | Last Updated on Mon, Nov 5 2018 1:39 AM

Sharp shooter Nawab Asghar Ali Khan is from Hyderabad - Sakshi

తాను చంపిన చిరుతతో షఫత్‌ అలీఖాన్‌(ఫైల్‌)

మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ ప్రాంతంలో 14 మందిని పొట్టనపెట్టుకున్న మ్యానీటర్‌ ‘అవని’(ఆడపులి)ని మట్టుపెట్టిన షార్ప్‌ షూటర్‌ నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్‌ హైదరాబాదీనే. తన తాత, తండ్రుల నుంచి ఈ ‘వేట’ను వారసత్వంగా తీసుకున్నారు. గతంలో తండ్రి నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌కు సాయంగా కొన్ని ఆపరేషన్స్‌లో పాల్గొన్నా... నేరుగా ఆయన చేపట్టిన తొలి ఆపరేషన్‌ ‘అవని’దే. నగరంలోని రెడ్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన షఫత్‌ దేశంలోని ఐదు రాష్ట్రాలకు సలహాదారుడిగా ఉండి, ఇప్పటి వరకు 27 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. 
– సాక్షి, హైదరాబాద్‌

జంతు ప్రేమికులూ దాగున్నారు... 
అస్ఘర్‌ తండ్రి షఫత్‌ అలీ ఖాన్‌ చేసిన ‘వేట’ల సంఖ్య 27కు చేరింది. 1976 నుంచి ‘వేటాడుతున్న’ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న 8 ఏనుగులు, 5 పులులు, 13 చిరుతల్ని హతమార్చారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లో రైతులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న 1,500 అడవి గేదెలు, 15,200 అడవి పందులు, 1,300 అడవి కుక్కల్ని చంపారు. ఈ వేటగాళ్లల్లో జంతు ప్రేమికులూ దాగి ఉన్నారు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్‌ టు సేవ్‌ ది టైగర్‌’పేరుతో ఈ తండ్రీకొడుకులు అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడ పులి కేవ లం 111 రోజులకే కాన్పు వస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నాం’అని చెప్తారు వారు. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.  

వారసత్వంగా వస్తున్న ‘వేట’... 
నవాబ్‌ అస్ఘర్‌ అలీ ఖాన్‌ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్‌ బ్రిటిష్‌ ఇండియాకు ఫారెస్ట్‌ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. బ్రిటీష్‌ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్‌ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. అస్ఘర్‌ తండ్రి షఫత్‌ అలీ ఖాన్‌ 1976లో 19 ఏళ్ల వయస్సులోనే తొలి ‘తూటా’పేల్చారు. కర్ణాటకలోని మైసూర్‌ సమీపంలో ఉన్న హెచ్‌డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ఆ కుటుంబం ‘వేట’ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్‌ అలీ ఖాన్‌ బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్‌గా పని చేస్తున్నారు. అక్కడున్న ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్‌ మానిమల్‌ కన్‌ఫ్లిక్ట్, తుపాకీల్లో తర్ఫీదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్‌ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. అనేక ఉదంతాల్లో మృత్యువు క్రూరమృగాల రూపంలో కొన్ని మీటర్ల దూరం వరకు వచ్చి ‘చచ్చింది’. 

తొలి ప్రాధాన్యం పట్టుకోవడానికే ఇస్తా..: అస్ఘర్‌  
మహారాష్ట్రలో తిప్పేశ్వర వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీ నుంచి ఐదేళ్ల వయసున్న అవని అనే ఆడపులి 20 నెలల క్రితం గర్భవతిగా ఉండి ఆహారం కోసం యవత్‌మాల్‌ వరకు వెళ్లింది. ఆ ప్రాంతంలో ఉన్న అడవి నుంచి పొలాల్లోకి వెళ్లి ఆహారం కోసం వెతుక్కుంది. ఈ నేపథ్యంలో అక్కడకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. దీంతో ఇతర జంతువుల కంటే మనుషుల్ని వేటాడటం తేలికని గుర్తించిన పులి మ్యానీటర్‌గా మారి పంజా విసురుతూ వచ్చింది. ఈ పులి 8 నెలల తర్వాత ప్రసవించింది. దీనికి జన్మించిన 2 పులి పిల్లల వయస్సు ప్రస్తుతం ఏడాది.

ఈ మూడూ కలసి యవత్‌మాల్‌ చుట్టూ ఉన్న 12 కి.మీ. పరిధిలో సంచరిస్తూ... తల్లి మనుషుల్ని వేటాడి చంపేస్తుండగా... మూడూ కలసి మృతదేహాలను తింటున్నాయి. ఇలా ఇప్పటి వరకు ఈ మ్యానీటర్‌ చేతిలో 14 మంది చనిపోయారు. సెప్టెంబర్‌ రెండో వారంలో అక్కడకు చేరుకుని వేట మొదలెట్టా. శుక్రవారం అవని హతమైంది. దీని కూనలు ఇంకా అక్కడే సంచరిస్తున్నాయి. వీటిని పట్టుకోవాల్సి ఉంది. నా తొలి ప్రాధాన్యం వాటికి మత్తుమందు ఇచ్చి పట్టుకోవడానికే. ఇలా తల్లి, రెండు పిల్లలు కలసి జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ చంపి తినడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే వీటిని వేటాడే అవకాశం దక్కడమూ అరుదే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement