ఓ ఎలమందా..అందేనా గొర్రెల మంద!
► గొర్రెల పథకంలో అడుగడుగునా ఇబ్బందులే
పొరుగు రాష్ట్రాల్లోనే జీవాలకు కొరత
మరి 82 లక్షల గొర్రెలను రాష్ట్రానికి తెచ్చేదెలా?
రంగంలోకి దిగిన దళారులు.. బోగస్ సభ్యత్వాలు
ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలు
lఇప్పటికే 5.70 లక్షలకుపైగా దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్
రెండేళ్లలో 82 లక్షల గొర్రెల పంపిణీ..! రాష్ట్రంలో యాదవ, కుర్మల కోసం గొర్రెల పథకం కింద ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యమిది. మరి అంత పెద్ద మొత్తంలో గొర్రెలు కొనుగోలు చేయటం సాధ్యమేనా..? అసలు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అంత పెద్ద సంఖ్యలో గొర్రెలు అందుబాటులో ఉన్నాయా..? దూరప్రాంతంలో వాటిని కొంటే రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు తడిసి మోపెడు కావా? ఒక్కసారిగా లక్షల సంఖ్యలో కొంటే డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరిగిపోవా? ఈ పథకంలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం ఆరంభ దశలోనే సర్కారుకు క్షేత్రస్థాయిలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గొర్రెల సంపదలో రెండో స్థానం
దేశంలోనే గొర్రెలు అత్యధికంగా ఉన్న రెండో రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 1.78 కోట్ల మేకలు, గొర్రెలున్నట్లుగా పశు సంవర్థక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో 1.23 కోట్ల గొర్రెలున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. గొర్రెల సంపదలో దేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో, ఏపీ మూడో స్థానంలో, కర్ణాటక నాలుగో స్థానంలో ఉన్నాయి. తక్కువ గొర్రెలున్న రాష్ట్రాలు ఎక్కువ గొర్రెలున్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయటం మార్కెట్ సూత్రం. కానీ.. ఇప్పటికే అత్యధిక గొర్రెలున్న తెలంగాణ ఒక్కసారిగా 41 లక్షల చొప్పున వరుసగా రెండేళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఎంచుకోవటం గమనార్హం.
పొరుగు రాష్ట్రాల్లోనే కొరత
రాష్ట్రానికి సరిపడే గొర్రెలు పొరుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులో లేవు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ప్రకారం 43 వేల యూనిట్లు అవసరం. అంటే దాదాపు 8.60 లక్షల గొర్రెలు. వీటిని కర్ణాటక నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ కర్ణాటకలో రెండు జిల్లాల్లో కేవలం 9 లక్షల గొర్రెలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో అమ్మకానికి, అంగట్లోకి వచ్చేవి 2 లక్షలకు మించే పరిస్థితి లేదు. అదే విషయాన్ని ఇటీవల అక్కడి గొర్రెల పెంపకందారులు జిల్లా నుంచి వెళ్లిన బృందాలకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన యూనిట్లను పంపిణీ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
దళారుల దందా..
ఒక్కో గొర్రెల యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 25 శాతం రూ.3,1250 లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తే.. మిగతా 75 శాతం(రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కానీ రవాణా ఖర్చుల పేరిట దరఖాస్తుదారుల నుంచి అడ్డగోలు వసూళ్ల పర్వం మొదలైంది. ఇప్పటికే దళారులు సైతం ఈ పథకంలో రంగప్రవేశం చేశారు. ఇటీవల బాధితులు స్వయంగా ఓ మంత్రికి మొరపెట్టుకోవటం గమనార్హం.
అంచనాకు మించి డిమాండ్
గొర్రెల యూనిట్లకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ సర్కారుకు దడ పుట్టిస్తోంది. ముందుగా ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలున్నాయి. ఈ ఏడాది రెండు లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల కుటుంబాలకు యూనిట్ల పంపిణీ లక్ష్యంగా ఎంచుకుంది. 18 ఏళ్లు నిండి.. సొసైటీల్లో సభ్యులైన వారందరినీ అర్హులుగా ప్రకటించింది. లాటరీ పద్ధతిలో ఈ ఏడాది సగం మందికి, వచ్చే ఏడాది మిగతా వారికి యూనిట్ల పంపిణీకి సిద్ధపడింది. కానీ కుటుంబంలో అర్హుల సంఖ్యపై సీలింగ్ లేకపోవటం, పలు చోట్ల బోగస్ సభ్యులు నమోదు కావడంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. గత నెల(మే) 10 నాటికే గొర్రెల ఫెడరేషన్‌కు 5.70 లక్షల మంది దరఖాస్తు చేశారు. దీంతో ఈ సంఖ్య 6.50 లక్షలకు చేరుతుందని అధికారుల అంచనా . ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు వంతున అందరికీ యూనిట్లు పంపిణీ చేయాలంటే 1.30 కోట్ల గొర్రెలు అవసరం కానున్నాయి.
రవాణాకు ఒక్కో యూనిట్‌కు రూ.2,000
మన రాష్ట్రంలో ఉన్న గొర్రెలు కొనుగోలు చేస్తే రీసైక్లింగ్ పేరిట అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు సర్కారు నడుం బిగించింది. కానీ దూరాభారంతో రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు కర్ణాటకలోని దావణగెరే, చిత్రదుర్గ్ నుంచి గొర్రెలు కొనాలని నిర్ణయించారు.
ఈ జిల్లాకు దావణగెరే 645 కి.మీ.ల దూరం. చిత్రదుర్గ్ 575 కి.మీ.ల దూరం. 250 గొర్రెలు రవాణా చేసే వ్యాన్‌లు కి.మీకు రూ.35 చొప్పున రేటు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన పది యూనిట్ల గొర్రెలను తెచ్చేందుకు రూ.23 వేల ఖర్చవుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. సిరిసిల్ల జిల్లాకు నెల్లూరు, కడప జిల్లాల నుంచి, నిజామాబాద్ జిల్లాకు అనంతపురం నుంచి గొర్రెలు తీసుకు రావాలని నిర్ణయించారు. దూరాల్లో స్వల్ప తేడాలున్నా ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2 వేల చొప్పున రవాణాకే ఖర్చవుతోంది. అంటే ఈ ఏడాది పంపిణీ చేసే రెండు లక్షల యూనిట్లకు రూ.40 కోట్లు రవాణాభారం తప్పని పరిస్థితి నెలకొంది.
కొండెక్కిన గొర్రె ధర
రాష్ట్ర ప్రభుత్వం భారీగా గొర్రెలు కొనుగోలు చేస్తుందనే ప్రచారంతో పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గొర్రెల ధరలు కొండెక్కాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.4 వేలకు లభ్యమైన గొర్రెలను ఇప్పుడు అమాంతం రూ.6 వేలకు పెంచేశారు. యూనిట్ల పంపిణీ సమయం దగ్గరపడుతుండటంతో ఈ రేటు మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది.