మా ఆవిడ చేసే సాంబార్‌ ఇడ్లీకి ఫిదా | Siddipet Police Commissioner Joyal Devis Exclusive Interview With Sakshi | Sakshi
Sakshi News home page

నాకు ప్రతిభ.. ప్రతిభకు నేను.. 

Published Sun, May 26 2019 7:29 PM | Last Updated on Sun, May 26 2019 7:34 PM

Siddipet Police Commissioner Joyal Devis Exclusive Interview With Sakshi

మా ఆవిడ ప్రతిభ మనస్సు పెట్టి చేసే స్మాల్‌ ఇడ్లీ.. సాంబార్‌ అంటే నాకు భలే ఇష్టం.. ఆ రోజు నిజంగా పండుగే..  మాకు పెళ్లి అయ్యేటప్పటికి ఆమెకు వంట రాదు. తర్వాత డ్యూటీలో భాగంగా నాతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వంట నేర్చుకుంది. సీ ఫుడ్‌ బాగా వండుతుంది.. కానీ ఇక్కడ అవి దొరకవు కదా.. అందుకే తీరిక దొరికినప్పుడు స్మాల్‌ ఇడ్లీ, సాంబారు చేస్తుందంటున్నారు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌. ‘ఆయనకు  ఇష్టమైన ఇడ్లీ చేయడం అంటే నాకు కూడా ఇష్టం.. ఆయన తిని ఆనందించడం కన్నా నాకేం కావాలి’ అంటున్నారు  ఆయన సతీమణి ప్రతిభ. శనివారం ‘సాక్షి పర్సనల్‌ టైం’తో సీపీ దంపతుల ముచ్చట్లు.. 

సాక్షి, సిద్దిపేట: మాది పెద్దలు కుదిర్చిన వివాహం..  మా ఇద్దరిది సాంప్రదాయక కుటుంబాలు. డాక్టర్‌గా ప్రతిభ పేదలకు, వృద్ధులకు సేవచేయడం చూసిన మా బంధువులు ఈ మ్యాచ్‌ గురించి చెప్పారు. అమ్మా నాన్నలకు కూడా అటువంటి వారే కావాలని కోరుకునేవారు.. ఇంకేముంది ఒప్పేసుకున్నా.. అన్నారు డేవీస్‌. అయితే పోలీస్‌ ఆఫీసర్‌ అంటే మా కుటుంబానికి ఇష్టం ఉండకపోయేది. కానీ మంచి దైవచింతన, పెద్దలపై గౌరవం, కింది స్థాయి నుంచి కష్టాలు, కన్నీళ్లు చవిచూసిన వ్యక్తిగా మా బంధువులు చెప్పారు. అంతకంటే ఏం కోరుకుంటామని ఆయన సతీమణి ప్రతిభ బదులు చెప్పారు.

మాది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా.. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చాం.. మాకు ఈ ప్రాంతంలో బంధువులు ఎవరూ లేరు.. నాకు మా ప్రతిభ.. ప్రతిభకు నేను.. మాకు ఇద్దరు కుమారులు ఎఫ్రేమ్‌ పీ జోయల్, ఇవాన్‌ పీ జోయల్, ఇది మా కుటుంబం.. అంతా సరదగా ఉంటాం.. అవకాశం దొరికితే ఇంటి వద్దనే ఎక్కువ గడిపేందుకు ఇష్టపడుతాం. నా పెళ్లి సమయం నాటికి ఆమెది ఎంబీబీఎస్‌ పూర్తి అయింది. సామాజిక సేవ చేయడం ఇష్టం. ఉట్నూరు ఆస్పత్రిలో పనిచేసినప్పుడు అందరు అంటూ ఉండేవారు.. అందుకోసమే ఆమె ఇష్ట్రపకారం ఎండీ కూడా చదివించాను. 

చదువును అశ్రద్ధ చేయలేదు..
చిన్నతనంలో ఎవ్వరైనా సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.. నేను కూడా అంతే.. వేసవి సెలవుల్లో మా నాన్న గారు ముందుగా పదిరోజులు బైబిల్‌ స్కూల్‌కు పంపించేవారు.. ఆ తర్వాత.. ఆటలే ఆటలు పొద్దన లేవగానే మిత్రులతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లడం.. వాలీబాల్‌ ఇతర ఆటలు ఆడటం.. కన్యాకుమారి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతా లకు వెళ్లడం భలే సరదాగా ఉండేది. అయితే ఎంత ఆటలు ఆడినా.. ఎటు వెళ్లినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.  సెలవులు ముగియగానే తిరిగి చదువు యుద్దం ప్రారంభించేవాళ్లం.. పోటీ పడి చదివే వాళ్లం..

కామిడీ సినిమా వస్తే చూడాల్సిందే.. 
కామిడీ సినిమాలు ఇంటే మా ఇద్దరికి ఇష్టం. అందుకోసమే కామిడీ సినిమా వచ్చిందంటే చూసి తీరాల్సిందే.. మనం సరదాగా సినిమాకు వెళ్తాం.  అక్కడ కూడా అంతా టెన్షన్, ఉత్కంఠంగా ఉంటే నచ్చదు. సినిమా చూసిన మూడు గంటలు సరదాగా ఉండాలి. నవ్వుకునేలా ఉండాలి.. ఇటీవల చూసిన ఎఫ్‌–2 సినిమా మొదటి ఆఫ్‌ నాకు నచ్చింది. అనగానే రెండో ఆఫ్‌ నాకు నచ్చిందని డాక్టర్‌ ప్రతిభ బదులు చెప్పారు. అదేవిధంగా విక్రమార్క సినిమా కూడా బాగా నచ్చిందని చెప్పారు. తీరికి దొరికితే సిద్దిపేట కోమటిచెరువు.. ఎక్కువ సమయం దొరికితే హైదరాబాద్‌ వెళ్లి వస్తాం.. అక్కడ షాపింగ్, ఫుడ్‌ కోర్టులోకి వెళ్లడం  అంటే కూడా ఇష్టమే. 

నైనిటల్‌ అంటే బాగా ఇష్టం.. 
ఇద్దరం బీజీగా ఉంటాం.. కానీ అప్పుడప్పుడు టూర్స్‌ వేస్తాం.. మా రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్‌ ఎప్పుడూ వెళ్తుంటా.. అయితే నైనిటాల్‌ అంటే బాగా ఇష్టం. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది. మా పెళ్లి అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు  ఇద్దరు కవలలు పుట్టారు.  వారి పుట్టిన రోజు మాకు బాగా ఆనందకరం కల్గించిన రోజు.. అదేవిధంగా చిన్నబాబు ఇవాన్‌ పీ జోయల్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నప్పుడు... ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉందని డాక్టర్‌  చెప్పారు. ఆరోజు ఇద్దరు కంటికి రెప్పకూడా వేయకుండా బాబును చూసుకుంటూ ఏడ్చాం. అంతటి బాధెప్పుడూ  రాలేదు. దేవుడి దయవల్ల ఇప్పుడు అంతా హ్యాపీ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement