ఊళ్లు.. ఊగుతున్నయ్
అప్పుడు ఒకటి.. ఇప్పుడు వెయ్యి
గుప్పుమంటున్న చీప్ లిక్కర్
గణనీయంగా పెరిగిన వినియోగం
తొర్రూరు పరిధిలో ఎక్కువ
గత ఏడాది ఒక కేసు అమ్మితే..
ఈ ఏడాది 1643 కేసుల అమ్మకం
వరంగల్ : ఆదాయమే లక్ష్యంగా మద్యం విక్రయాలు పెంచుతున్న ఎక్సైజ్ శాఖ తీరుతో గ్రామాల్లోని పేదల కుటుంబాల్లో చిచ్చురేగుతోంది. నాటు సారాను నియంత్రించామని ప్రకటించుకున్న ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. నాటు సారాను తయారు చేసే వారిపై చర్యలు తీసుకోకుండా.. వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా బెల్ట్ షాపులు నిర్వహించుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. దీంతో జిల్లాలో బెల్ట్ షాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నాటుసారా విక్రయించే వారూ బెల్ట్ షాపులు తెరుస్తుండడంతో ఒక గ్రామంలో గతంలో ఒకటిరెండు బెల్ట్ షాపులు ఉంటే.. ఇప్పుడు కనీసం పది వరకు పెరిగాయి. గ్రామాల్లో కొత్తగా వెలుస్తున్న బెల్ట్ షాపుల్లో అమ్ముడుపో యే మద్యంలో 90 శాతం చీప్ లిక్కరే ఉంటోం ది. చీప్ లిక్కర్ వినియోగం జిల్లాలో గణనీయం గా పెరిగిందని అధికారిక లెక్కలే చెబుతున్నా యి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం 2014 నవంబరులో జిల్లా వ్యాప్తంగా 1209 కేసుల చీప్ లిక్క ర్ అమ్మకాలు జరిగగా.. ఈ ఏడాది ఏకంగా 25, 848 కేసుల చీప్ లిక్కర్ వినియోగమైంది. మద్యపాన నియంత్రణపై అవగాహన కల్పించాల్సిన ఎక్సైజ్ శాఖ ఈ పనిని పూర్తిగా పక్కనబెట్టింది.
ఈ కారణంగానే జిల్లాలో చీప్ లిక్కర్ వినియో గం పెరిగింది. ఈ చీప్ లిక్కర్ పేద కుటుంబాలను నాశనం చేస్తోంది. నాటుసారా పోయింద ని సంతోషపడే సమయంలో బెల్ట్ షాపులు తమను దెబ్బతీస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు చొర వ తీసుకుని.. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి.
ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో వరంగల్, మహబూబాబాద్ యూనిట్లు ఉన్నాయి. వరంగల్ యూనిట్ పరిధిలో తొమ్మిది, మహబూబాబాద్ యూనిట్ పరిధిలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఏడాది క్రితం వరకు నాటుసారా ఎక్కువగా ఉండి ఇప్పుడు తగ్గిపోయిన మహబూబాబాద్ యూనిట్ పరిధిలో చీప్ లిక్కర్ వినియోగం భారీగా పెరిగింది. ఈ యూనిట్ పరిధిలో గత ఏడాది నవంబరు లో 657 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు జరిగా యి. ఈ ఏడాది నవంబరులో ఏకంగా 8,409 కేసుల చీప్ లిక్కర్ అమ్ముడుపోయింది.
తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది ఈ స్టేషన్ పరిధిలో కేవలం ఒక్క కేసు మాత్రమే అమ్ముడుపోయింది. ఈ ఏడాది 1643 కేసుల చీప్ లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే ఈ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇక్కడి ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా విక్రయించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా బెల్ట్ షాపులను నిర్వహించుకోండని సూచిస్తున్నట్టు కొందరు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
వరంగల్ అర్బన్ పరిధిలోనూ చీప్ లిక్కర్ అమ్మకాలు ఊహించని విధంగా పెరిగాయి. అర్బన్ స్టేషన్ పరిధిలో గత ఏడాది కేవలం 255 కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది ఏకంగా 6,108 కేసులను విక్రయించారు. వరంగల్ రూరల్ స్టేషన్ పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ స్టేషన్ పరిధిలో గత నవంబరులో 25 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు జరిగగా.. ఈ ఏడాది నవంబరులో 4,131 కేసులు వినియోగమైంది.