- పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధులు 13 జిల్లాలకు సంబంధించిన 500 ఏళ్ల చరిత్ర అడిగారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. వాళ్లు అడిగిన సమాచారం ఇప్పటికే 95 శాతం ఇచ్చామని, మిగతా 5 శాతం ఇస్రో నుంచి తీసుకోవాల్సి ఉందని అన్నారు.
గురువారం సచివాలయంలో మంత్రితో పాటు వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సింగపూర్ ప్రతినిధి బృందం సుమారు ఐదు గంటల పాటు సమావేశమైంది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై పలు కోణాల్లో చర్చించారు. సాయంత్రం మంత్రి నారాయణ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర్ర పభుత్వం ఇచ్చిన సమాచారాన్ని చూసి సింగపూర్ బృందం ఉబ్బి తబ్బిబ్బయిందన్నారు. వారికి ఎలాంటి సమాచారం కావాలన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు తక్షణం స్పందించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. సింగపూర్ బృందంతో సమన్వయంతో వ్యవహరించడానికి ముగ్గురు అధికారులను నియమిస్తున్నాం. ఈ ముగ్గురు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పనిచేస్తారని తెలిపారు.