సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకారంగా సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగులు, అధికారులు తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని నిర్ణయించారు. తమ వేతనం నుంచి ఒక్కరోజు మూలవేతనం, కరువు భత్యంను సీఎం సహాయనిధికి చెల్లించాలని సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. 2,400 మంది సింగరేణి అధికారుల ఒక రోజు మూలవేతనం, కరువు భత్యం కలిపి రూ.కోటి, ఇక 47 వేల మంది కార్మికుల ఒకరోజు మూలవేతనం, కరువు భత్యం కలిపి రూ.7 కోట్ల 50 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు, కార్మికుల వితరణ కలిపి మొత్తం రూ.8.50 కోట్ల చెక్కును త్వరలో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయాలలో సింగరేణి ఉద్యోగులు, అధికారులు ఇదే తరహాలో వితరణను చాటుకున్నారు. క్లిష్ట సమయంలో కార్మికులు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో దక్షిణ భారత విద్యుత్ అవసరాలకు బొగ్గు అందిస్తున్న సింగరేణి సంస్థను అత్యవసర సేవల సంస్థగా గుర్తించారని..కనుక సింగరేణి ఉద్యోగులు, అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎటువంటి బొగ్గు కొరత లేకుండా సింగరేణి ఉద్యోగులు నిత్యం పాటుపడుతున్నారని వివరించారు. ప్రతి గనిలో, కార్మిక కాలనీల్లో, ఆస్పత్రుల్లో, కరోనా వ్యాప్తి నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment