బతుకమ్మ చీరల తయారీలో సిరిసిల్ల రికార్డు | Sircilla record in the making of bathukamma sarees | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరల తయారీలో సిరిసిల్ల రికార్డు

Published Thu, Aug 31 2017 2:13 AM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

బతుకమ్మ చీరల తయారీలో సిరిసిల్ల రికార్డు

బతుకమ్మ చీరల తయారీలో సిరిసిల్ల రికార్డు

- 3 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి 
15 వేల మందికి ఉపాధి.. 
రూ. 75 కోట్ల ఆదాయం
 
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతకార్మికులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో మూడు కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలు బుధవారం నాటికి మూడు కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి మైలురాయిని దాటారు. జూన్‌ 15న బతుకమ్మ చీరల ఆర్డర్లను జౌళిశాఖ అధికారులు ఇవ్వగా.. జూన్‌ 30న వస్త్రోత్పత్తి ప్రారంభించారు. సరిగ్గా రెండు నెలల వ్యవధిలో 3 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తిని సాధించారు.

ఒక్కోచీర పొడుపు ఆరు మీటర్లు ఉండగా.. 50 లక్షల చీరలను ఉత్పత్తి చేశారు. సిరిసిల్లలోని 52 మ్యాక్స్‌ సంఘాలు, మరో 312 చిన్న తరహా కుటీర పరిశ్రమలు, 10,200 మంది కార్మికులు, 1,852 మంది ఆసాములు రేయింబవళ్లు శ్రమించి మైలురాయి దాటారు. వార్పర్లు, వైపని, హమాలీ, టాకాలు పట్టే కార్మికులు మొత్తంగా కార్మిక క్షేత్రంలో 15 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు. సెప్టెంబర్‌ 4 లోగా మరో 50 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి సాధించే అవకాశం ఉంది. ఒక్కో చీర ఉత్పత్తికి ప్రభుత్వం రూ.150 చెల్లిస్తుండగా.. ఇప్పటి వరకు రూ.75 కోట్ల విలువైన చీరలను ఉత్పత్తి చేశారు. ఇందులో నేత కార్మికులకు నేరుగా లభించిన ఉపాధి రూ.21 కోట్లు ఉంటుంది. వస్త్రపరిశ్రమలో బతుకమ్మ చీరలు విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టాయి. సిరిసిల్ల చీరల బట్టను సూరత్‌లో ప్రాసెసింగ్‌ చేసి, 150 రకాల రంగుల్లో ప్రింటింగ్‌ చేసి పంపిణీకి ప్యాకింగ్‌ చేస్తున్నారు.
 
విద్యుత్‌ కోత లేకుంటే మరో కోటి మీటర్లు 
జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణతో తరచూ కరెంట్‌ కోత విధించారు. కోతలేకుంటే మొత్తంగా సిరిసిల్లలో మరో కోటి మీటర్ల వస్త్రోత్పత్తి జరిగేది. బతుకమ్మ చీరలకు అవసరమైన 6.10 కోట్ల మీటర్లలో సిరిసిల్లలోనే 3.50 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే 3 కోట్ల మీటర్లు పూర్తి అయింది. గడువులోగా మరో 50 లక్షల మీటర్లు వస్తుందని ఆశిస్తున్నాం.  
– వి.అశోక్‌రావు, ఏడీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement