భూపాలపల్లిలో కుప్పకూలిన పోలీస్ హెడ్‌క్వార్టర్ స్లాబ్ నిర్మాణం
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ భవనం నిర్మాణ సమయంలోనే కుప్పకూలింది. అయితే, తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భూపాలపల్లి జిల్లా ఏర్పాటయ్యాక మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. భవనానికి ముందు పోర్టికో నిర్మాణానికి కాంట్రాక్టర్ రెండు నెలల క్రితం సెంట్రింగ్ ఏర్పాటు చేయించాడు. ఇంతలోనే లాక్‌డౌన్ విధించడంతో కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇటీవలే నిర్మాణ పనులను ప్రారంభించాడు.
శనివారం పోర్టికో స్లాబ్ వేస్తుండగా సాయంత్రం సేద తీరేందుకు కూలీలు మొత్తం స్లాబ్ నుంచి కిందకు దిగారు. నలుగురు మేస్త్రీలు మాత్రమే పైన ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో మేస్త్రీలు గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఆంటోని, బ్రహ్మయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందనే ప్రచారం సాగుతోంది. రెండు నెలల క్రితం సెంట్రింగ్ వేయించడం... ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో స్లాబ్ వేయడం మూలంగానే ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment