
ఇంట్లో 50 గుడ్లు పెట్టిన పాము
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 గుడ్లు పెట్టిన పామును ఎక్కడైనా చూశారా..
చుంచుపల్లి: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 50 గుడ్లు పెట్టిన పామును ఎక్కడైనా చూశారా.. ఓ నాగుపాము 50 గుడ్లు పెట్టింది. ఈ వింత దృశ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. ఈ కాలనీలో నివాసముంటున్న ఎల్‌ఐసీ ఉద్యోగిని జి. రాజారాణి ఆదివారం ఇంట్లో పనిచేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బుస్ మన్న శబ్దం వినిపించింది.
ఆ ఇల్లంతా వేతికి చూడగా ఇంటి ఆవరణలో ఉన్న ఇసుక బస్తాల్లో నాగుపాము గుడ్లను పొదుగుతూ కనిపించింది. భయభ్రాంతులకు గురైనా ఆమె కుటుంబీకులు ప్రాణాధార ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి పామును పట్టుకుని దాని గుడ్లను సురక్షితంగా బయటకు తిసి చూస్తే మొత్తం 50 గుడ్లు ఉన్నాయి.
దీంతో స్థానికులు పామును, దాని గుడ్లను చూసేందుకు తరలివచ్చారు. బుసలు కొడుతున్న పామును ట్రస్ట్ అధ్యక్షుడు జిమ్ సంతోష్, సభ్యులు మధు, సూర్యలు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు.