‘సోషల్ మీడియా’ బలమైన సాధనం | 'Social media' a ​​strong tool | Sakshi
Sakshi News home page

‘సోషల్ మీడియా’ బలమైన సాధనం

Published Sat, Mar 29 2014 3:46 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

'Social media' a ​​strong tool

 తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : సామాజిక మాధ్యమాలు (సోషల్ మీడియా) కేవలం సమాచార ప్రసారం కోసం మాత్రమే కాకుండా ప్రపంచగతిని మార్చే శక్తిమంత  సాధనాలుగా ఎదిగాయని ప్రముఖ జర్నలిజం అధ్యాపకులు పీఎల్ విశ్వేశ్వరరావు అన్నారు. తెలంగాణ యూ నివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సామాజిక మాధ్యమాలు-సవాళ్లు, సమస్యలు’ అనే అంశంపై రెండు రోజుల జాతీ య స్థాయి సెమినార్ ను ప్రారంభించారు. సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో సోషల్ మీడియా రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక రంగాలపై బలమైన ప్రభావాన్ని చూపుతోందన్నారు.

 దేశంలో 92 వేల పత్రికలు, 825 టెలివిజన్ చానళ్లు ఉన్నాయని, అయితే ఈ ప్రసార మాధ్యమాలు కొద్దిమంది బలవంతులు,ధనవంతుల గుప్పిట్లోనే ఉండటం విచారకమన్నారు. బాధితులు, సామాన్యులకు అండ గా ఉండాల్సిన మీడియా... కొన్ని ఒత్తిడిల కారణంగా వారి పక్షా న్ని విస్మరించడం తగదన్నారు. సంప్రదాయబద్ధమైన మీడియా నిర్వహించని కొన్ని బాధ్యతల్ని సోషల్ మీడియా నిర్వహిస్తుందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వార్త వేగవంతంగా ప్రపంచమంతా చేరుకోగలిన శక్తి ఉండటం వల్లే సోషల్‌మీడియా  బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. సోషల్ మీడియాకు సామాజిక బాధ్యతలు ఉన్నాయని, వీటిని గుర్తించకపోతే సమాజంలో  విపరీత పరిణామాలు తప్పవన్నారు.

 దుర్వినియోగం కాకుండా చూడాలి
 సీనియర్ పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త డాక్టర్ అఖిలేశ్వరి ఈ సదస్సులో కీలకోపాన్యాసం చేశారు. సైబర్ సాంకేతిక రంగంలోని అనివార్యతల కారణంగా సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా మహిళలపై వివక్ష, వేధింపులు కొనసాగుతుండడం విచారకరం అన్నారు. విద్యార్థులు, యువత సోషల్ మీడియాను వివేకంతో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.

 బలపడుతోంది..
 సమాచార రంగంలో సంప్రదాయ మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా బలపడుతోందని సమాచార హ క్కు చట్టం రాష్ట్ర మాజీ కమిషనర్, ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అన్నారు. సోషల్ మీడియా ద్వారా లభ్యమయ్యే మంచి ఫలితాలను మాత్రమే స్వీకరించాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో వచ్చిన విప్లవాల్లో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు. తెయూ ప్రిన్సిపాల్ ధర్మరాజు ఈ సెమినార్‌కు అధ్యక్షత వహించారు. మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యక్షుడు,సెమినార్ డెరైక్టర్ ప్రొఫెసర్ కే.శివశంకర్ సదస్సు లక్ష్యాల్ని వివరించారు. సదస్సులో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పలువురు తమ పరిశోధనా పత్రాల్ని సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement