ఇన్‌చార్జిలే దిక్కు
పదవీ విరమణ కారణంగా కొన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయి. బదిలీల వల్ల మరికొన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఆయా స్థానాల్లో మాత్రం కొత్త అధికారులు రావడం లేదు. జిల్లాలో ఉన్న అధికారులకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. దీంతో ఏళ్లుగా రెగ్యులర్ అధికారులు లేక ఆయా శాఖల్లో పాలన కుంటుపడుతోంది.
ఇందూరు : సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే సమర్థులైన అధికారులుండాలి. కింది స్థాయి ఉద్యోగులతో పని చేయించాలన్నా, వారిని క్రమశిక్షణలో ఉంచాలన్నా ఆయా శాఖలకు రెగ్యులర్ అధికారులు ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయి. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఖాళీల భర్తీపై దృష్టి సారించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఇందూరు జిల్లాలో పలు జిల్లా స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లలో జిల్లాస్థాయి అధికారులు కరువయ్యారు. దీంతో చాలా శాఖల్లో ఇన్‌చార్జిలే కని పిస్తున్నారు. ఒక అధికారి బదిలీపై వెళ్లడం వల్లో, ఉద్యోగ విరమణ పొందడం వల్లో ఖాళీ అయిన స్థానాన్ని వెంటనే భర్తీ చేయకపోవడం వల్ల ఈ పరి స్థితి వచ్చింది.
అయిష్టంగానే అయినా..
ఇష్టం లేకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు పలువురు అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొందరు అధికారులకు రెండు మూడు శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. రెండు బాధ్యతలు నిర్వర్తించడం తమకు తలకు మించిన భారంగా మారిం దని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. తమ సొంత శాఖను చూసుకోవడంతో పాటు అదనంగా మరో శాఖ బాధ్యతలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ఒక పూట ఇక్కడ.. మరో పూట అక్కడ విధులు నిర్వర్తించడం సాధ్యం కావడంలేదంటున్నారు. పని భారం తట్టుకోలేక ‘‘నాకు ఇన్‌చార్జి బాధ్యతలు వద్దు’’ అని పలువురు అధికారులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్న దాఖలాలున్నాయి. ‘‘రెగ్యులర్ అధికారి వచ్చే వరకు ఎలాగోలా నెట్టుకురండి’’ అంటూ వారిని సముదాయించినట్లు సమాచారం.
గాడి తప్పిన పాలన
రెగ్యులర్ జిల్లా స్థాయి అధికారి లేకపోవడంతో ఆయా శాఖల పాలన గాడితప్పింది. సిబ్బంది, ఉద్యోగులు క్రమ శిక్షణ తప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేసే పథకాలు సక్రమంగా ప్రజలను చేరడం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తారని, ఆయా శాఖలకు రెగ్యులర్ అధికారులను నియమిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో ప్రధాన శాఖల్లో ఖాళీగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పోస్టుల్లో రెగ్యులర్ అధికారులను నియమిస్తే బాగుంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
* జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా ఉన్న రాములు గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆ స్థానంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన సహాయ అధికారి(ఏఎస్‌డబ్ల్యూవో) జగదీశ్వర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
* గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ అధికారి(ఏటీడబ్ల్యూవో) పదవీ విరమణ పొందటంతో శంకర్ అనే వార్డెన్ ఇన్‌చార్జ్ గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ అధికారిగా కొనసాగుతున్నారు.
* జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్ పోస్టు ఏడాదికిపైగా ఖాళీగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్ ఆ బాధ్యతలు కూడా చూస్తున్నారు.
* జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాజేశ్వర్ 16 నెలల క్రితం వేరే జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇంత వరకు ఆయన స్థానంలో రెగ్యులర్ అధికారి నియామకం కాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు.
* రెండేళ్లుగా జిల్లా సాంఘిక సంక్షేమాధికారి(డీఎస్‌డబ్ల్యూవో) లేరు. ప్రస్తుతం అల్ఫోన్స్ అనే అధికారి ఇన్‌చార్జిగా ఉన్నారు.
* జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసిన రాజయ్య ఏడాది క్రితం పదవీ విరమణ పొందారు. ఇప్పటివరకు రెగ్యులర్ అధికారిని నియమించలేదు. ఏడాదిగా బోధన్ ఏబీసీడబ్ల్యూవో విమలాదేవి ఇన్‌చార్జి బీసీడబ్ల్యూవోగా కొనసాగుతున్నారు.
* బీసీ కార్పొరేషన్ ఈడీగా పని చేసిన రాజశేఖర్ రెండేళ్ల క్రితం వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. అర్బన్ ఐకేపీ పీడీ సత్యనారాయణ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
* డీఆర్‌డీఏ ఏపీడీ(అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇన్‌చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించలేదు.
* జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్(ఏజేసీ) శేషాద్రి ఆనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజారాం ఇన్‌చార్జి ఏజేసీగా కొనసాగుతున్నారు.
* సైనిక సంక్షేమ శాఖకు ఏడాదిగా రెగ్యులర్ అధికారి లేరు. ఐకేపీ పీడీ వెంకటేశం ఇన్‌చార్జి అధికారిగా వ్యవహరిస్తున్నారు.
* జిల్లా పరిషత్‌లో తొమ్మిది నెలలుగా డిప్యూటీ సీఈఓ లేరు. ఏఓ పోస్టు కూడా ఖాళీగా ఉంది.