ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయం | Some RTC Workers Still In Dilemma Even After Calling Off The Strike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయం

Published Thu, Nov 14 2019 10:50 AM | Last Updated on Thu, Nov 14 2019 10:50 AM

Some RTC Workers Still In Dilemma Even After Calling Off The Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమ్మెలో ఉండి తిరిగి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయంలో పడింది. ఈనెల ఐదవతేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మంది మాత్రమే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా..అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖలు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు.  

అసలేం జరిగింది.. 
ఈనెల 2న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గడువు ప్రకటనకు తొలిరెండ్రోజులు కార్మికుల నుంచి స్పందనలేదు. తాము పనిచేస్తోన్న డిపో మేనేజర్ల వద్దకు వెళ్లి లేఖలు ఇస్తే సమ్మెలో ఉన్న తోటి కార్మికుల ఆగ్రహానికి గురవుతామన్న భయం కార్మికుల్లో ఉందని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ నెల 4న కార్మికులు పనిచేస్తోన్న డిపోలోనే కాకుండా ఏ డిపోలో లేఖ ఇచ్చినా స్వీకరిస్తామని, కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు..ఇలా కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాలను ప్రకటించారు. దీంతో చివరిరోజు ఎక్కు వ మంది కార్మికులు ఆయా ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేశారు. ఈ లేఖల్లో కొన్ని మాత్రమే సంబంధిత డిపోలకు చేరగా, మిగతావి అందలేదు. ఇప్పుడదే ఈ గందరగోళానికి కారణమైంది. ‘నేను పనిచేస్తున్న డిపోలో కాకుండా నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లేఖ ఇవ్వగా అక్కడి ఏసీపీనే స్వయంగా అందుకున్నారు. వారం గడిచినా నా లేఖ సంబంధిత డిపో మేనేజర్‌కు అందలేదు. దీంతో నాకు అధికారుల నుంచి పిలుపు రాలేదు. ఏం జరిగిందో వాకబు చేస్తే అసలు లేఖనే రాలేదని చెప్పారు. ఇప్పుడు ఈడీ కార్యాలయం నుంచి అనుమతి పొందితేనే చేర్చుకుంటామంటున్నారు’అని నగరానికి చెందిన ఓ డిపో స్థాయి అధికారి పేర్కొన్నారు.

ఇలాంటి వారు ఎంతోమంది. ప్రస్తుతం ఆర్టీసీ భవితవ్యం కోర్టు ఆదేశాలపైనే ఆధారపడ్డ నేపథ్యంలో, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది విధుల్లో చేరాలనుకుంటున్నారు. సమ్మె నుంచి బయటకొచ్చి ధైర్యం చేసి లేఖలిచ్చినా, ఇప్పుడవి అధికారులకు చేరకపోవటంతో వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తమకు గడువులోపు లేఖలు అందినవారిని మాత్రమే విధుల్లోకి తీసుకున్నామని, లేఖలు ఇచ్చి ఇప్పటి వరకు విధులకు రాని వారిని, లేఖలు ఇవ్వనివారిని సమ్మెలోనే ఉన్నట్టుగా పరిగణిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement