పీపుల్స్‌ ఫ్రెండ్లీ.. | South Central Railway Special Trains For Sankranthi Festival | Sakshi
Sakshi News home page

పీపుల్స్‌ ఫ్రెండ్లీ..

Published Sat, Jan 12 2019 10:47 AM | Last Updated on Sat, Jan 12 2019 10:47 AM

South Central Railway Special Trains For Sankranthi Festival - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా పలు చర్యలు చేపట్టింది.రెండు రోజులుగా లక్షలాది మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి 60 జన సాధారణ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో అన్ని జనరల్‌ బోగీలే ఉంటాయి. టిక్కెట్‌ కూడాఅప్పటికప్పుడు బుక్‌ చేసుకొని వెళ్లిపోవచ్చు. జనసాధారణ రైళ్లే కాకుండా ఎక్స్‌ప్రెస్, మెయిల్‌ సర్వీసుల్లోనూ జనరల్‌ బోగీల్లో టిక్కెట్‌ బుకింగ్‌ల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌ సిస్టమ్‌ (యూటీఎస్‌) మొబైల్‌ అప్లికేషన్, రైల్వేస్టేషన్‌లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్స్‌ (ఏటీవీఎంలు), కోటీవీఎంలు (క్యాష్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్‌లు) సంక్రాంతి రద్దీ వేళ ప్రయాణికులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. టిక్కెట్‌ల కోసం గంటల తరబడి లైన్‌లలో పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా  అప్పటికప్పుడు  యూటీఎస్‌ యాప్‌  ద్వారా  టిక్కెట్‌ బుక్‌ చేసుకొని  బయలుదేరుతున్నారు.మరోవైపు  స్పెషల్‌ రైళ్లు, సువిధ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే జనసాధారణ రైళ్లలో చార్జీలు కూడా తక్కువగా ఉండడంతో  నగరవాసుల సంక్రాంతి ప్రయాణం ఈజీగా మారింది. 

పెరిగిన యూటీఎస్‌ బుకింగ్‌లు...
అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌ సిస్టమ్‌ యాప్‌ను గత సంవత్సరం ప్రవేశపెట్టారు. మొదట్లో ఎంఎంటీఎస్, సబర్బన్‌ రైళ్లలో సాధారణ టిక్కెట్‌ బుకింగ్‌ల కోసం అందుబాటులోకి తెచ్చిన యూటీఎస్‌ను అన్ని రైళ్లలోని  జనరల్‌ బోగీలకు విస్తరించారు. ట్రైన్‌ బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా ఈ యాప్‌ ద్వారా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణికులు తమ ఇంటి నుంచి రైల్వేస్టేషన్‌కు బయలుదేరే  సమయంలోనే టిక్కెట్‌ బుక్‌ చేసుకొని, ఆన్‌లైన్‌ ద్వారా చార్జీలు చెల్లించవచ్చు. ఎలాంటి కాలయాపన లేకుండా నేరుగా రైలెక్కవచ్చు. ఈ  సదుపాయం సాధారణ ప్రయాణికులకు ఇప్పుడు ఎంతో ఉపయోగంగా మారింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో రైళ్లు, లక్షల్లో ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. అన్ని రైళ్లలోనూ  చాలావరకు బుకింగ్‌లు నిలిచిపోయాయి. ప్రస్తుతం జనరల్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో  యూటీఎస్‌ యాప్‌కు అనూహ్యంగా ఆదరణ పెరిగింది. ప్రతి రోజు సుమారు 2500 టిక్కెట్‌లు ఈ యాప్‌ ద్వారా  బుక్‌ అవుతున్నట్లు  అధికారులు తెలిపారు. ఒక టిక్కెట్‌పైన కనీసం  ఐదుగురు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి రోజు  10 వేల నుంచి  15 వేల మంది ప్రయాణికులు  ప్రస్తుతం యూటీఎస్‌ యాప్‌ను వినియోగించుకొని  బయలుదేరుతున్నారు. ఇప్పటికే 1.5 లక్షల మంది  వినియోగదారులు యూటీఎస్‌ను  డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు  అంచనా. 

ఏటీవీఎంలకు డిమాండ్‌...
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం 20 ఆటోమేటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మిషన్‌ (ఏటీవీఎం)లను  అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ ఏటీవీఎంల నుంచి కూడా జనరల్‌ టిక్కెట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. అలాగే ఒకటి, పదో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ల వద్ద కోటీవీఎంలు ఉన్నాయి. నగదు చెల్లించి బుక్‌ చేసుకొనే వారికి  ఇవి ప్రయోజనం. వీటిని వినియోగించుకొనేందుకు సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ‘జనరల్‌  క్యూలలో టిక్కెట్‌ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా  ఏటీవీఎంలు, కోటీవీంలను వినియోగించుకోవచ్చునని’ అధికారులు  తెలిపారు. కొద్ది రోజులుగా వీటి వినియోగం గణనీయంగా పెరిగిందని సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.   
 
పోటెత్తిన రద్దీ....
సంక్రాంతికి సొంత ఊళ్లకు తరలి వెళ్తున్న ప్రయాణికులతో శుక్రవారం బస్‌స్టేషన్‌లు, రైల్వేస్టేషన్‌లు పోటెత్తాయి. తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 3500 రెగ్యులర్‌ బస్సులతో పాటు శుక్రవారం  మరో 1000 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు, కూకట్‌పల్లి, మియాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, సాగర్‌రింగురోడ్, తదితర ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో పోటెత్తాయి.రైల్వేస్టేషన్‌లలోనూ  ప్రయాణికుల రద్దీ  భారీగా పెరిగింది. గత రెండు రోజులుగా సుమారు 10 లక్షల మంది నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు.సంక్రాంతి సందర్భంగా  ఆర్టీసీ  5252 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.వివిధ ప్రాంతాలకు   ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 200 రైళ్లతో పాటు  మరో  150 రైళ్లను (60 జనసాధారణ రైళ్లు)  దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది.బస్సులు, రైళ్లలోనే కాకుండా  సొంత వాహనాల్లోనై భారీ ఎత్తున బయలుదేరారు. విమాన ప్రయాణాలకు సైతం డిమాండ్‌ పెరిగింది.  హైదరాబాద్‌ నుంచి  ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న 1000 ప్రైవేట్‌ బస్సుల్లోనూ  ప్రయాణికులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు  ప్రైవేట్‌ ఆపరేటర్లు  పోటీ పడి మరీ  చార్జీలను  ఒకటి,రెండు రెట్లు పెంచేశారు.  ప్రత్యేక బస్సుల్లో  ఆర్టీసీ సైతం 50 శాతం అదనపు చార్జీలను విధించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement